Sunday, July 25, 2021

వికాసం...వివేకం... 31-12-2020

 

వికాసం...వివేకం...

మన తెలుగు నూతన సంవత్సరం

గ్రెగోరియన్ కాల గమనము లో పేజీ మార్పు 
గ్రీకు పద్ధతిన ఏర్పరుచుకున్న కా విభజన కూర్పు 
గ్రీన్ విచ్ రేఖ చివరన మరొక తూర్పు 
గిర్రు గిర్రున తిరిగే భూగ్రహానికి మరొక మలుపు 

ఆంగ్ల నూతన వత్సరమంటూ 
అర్రులు చాచిన జనులకు 
కరువులో కాగిపోతున్న కళేబరాలకు
జుర్రుకోవడానికొక చీకటి రాత్రి..... 

ఆయనంలో మార్పు కాదు 
ఋతువులో మార్పు లేదు 
బతుకులో వెలుగులు రావు
కాలంలో కాకలు తీరలేదు 
పక్షులు సైతం ఆనందించవు
చెట్టు చిగురించదు... 
పైగా ఆకు రాలి మోడువారుతుంది.... 

వసంతాగమనంతో ప్రకృతి పులకరిస్తే
నులి వెచ్చని ఉషోదయాత్పూర్వాన
ఉగాది ఉదయాన ఉత్సాహాలు నింపి 
షడ్రుచుల ఆనందాలు నింపు... 

శుచి శుభ్రతల చిరునామా 
ఉమ్మడి కుటుంబాల మన ఉగాది
ఎవరికి వారే యమునా తీరే
పాచి కేకులు, సుక్క మందులు, జీవహింసలు
పరుగుల్లో మూలమలుపుల్లో
పరలోక యాత్రలు......... 

అజ్ఞాన తిమిరాలను తరిమే
వికాసాల జ్యోతి ప్రజ్వలనం 
విజ్ఞానాల విరించి ఉగాదికి.... 
అసలు పోలికే లేని అంట కాగే 
ఆంగ్ల నూతనానికి  దీపాలార్పడం 
ఎలా నిర్వచించను ..... 

కాల గమనము లో మరో మైలు రాయి 
కలి పురుషునికి ఇది ఒక వత్సరం 
నిన్నటి అనుభవాల పాఠాల నుండి 
రేపటి ఫలితాలు  నిర్దేశించుకోగలిగే 
ఆదర్శ పథాన్ని ఆచరించగలగడం వివేకం.... 

యుగాలనాడు నుడివినదే 
గీతాచార్యుడు ఎప్పుడో చెప్పాడు  
తెలియని పర ధర్మం కన్నా 
తెలిసిన  మానధర్మం ఎంతో మిన్నని..... 

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment