Saturday, July 31, 2021

నాటి ఉత్తరం .... నేటి ఉత్తరం తేది : 02-03-2021

 నాటి ఉత్తరం .... నేటి ఉత్తరం 

తేది : 02-03-2021
కవిత సంఖ్య : 91

దూర భారాలను తగ్గించే 
దివ్య ఔషధం ..... 
మంచి చెడుల మర్మం 
తెలిపే మర్మయోగి..... 
క్షేమ సమాచారాలను 
మోసుకొచ్చే తోక లేని 
పిట్ట ....  

చదువులకో  కొలువులకో 
బతుకు దెరువులకో ..... 
బంధాలకు దూరంగా 
బతికేటోళ్లకు ఉఛ్వాసాలు  
నిచ్వాసాలు నాటి ఉత్తరం.... 

కొత్తపెళ్లి కూతుర్లకు 
కన్న తల్లి  తండ్రుల 
తోబుట్టువుల ఆయువు పట్టు.... 
ఆత్మీయతల కలబోత....  

నెత్తిన టోపీ పెట్టి 
ఖాకీ బట్టలు ధరించి 
ఘల్లు ఘల్లునా గంట 
కొట్టే పెద్దమనిషంటే 
దేశమంతా తెలిసిన 
దేశ బంధు...... 
వేల కళ్ళు ఎదురుచూసేవి నాడు.... 

ప్రపంచీకరణ పలువలో 
సాంకేతికత సొబగులో 
స్థిర దూరవాణిలు వచ్చి కొంత.... 
చరవాణిలు వచ్చి ఇంకొంత..... 
వాట్సాప్పులలో  వారెవ్వాలు 
స్కైపులలో పలకరింపులు 
దర్శనీయతలతో దద్దరిల్లుతూ 
స్మార్ట్ ఫోన్ల సౌకర్యాలతో 
బంధు మిత్రుల ఆత్మీయతలకే 
హాయ్ .... బాయ్ .... అయిపోతున్నై .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment