తీరం దాటని తుఫాను......
తేది : 22-02-2021
శీర్షిక:
తీరం దాటని తుఫానే ......
కవిత సంఖ్య : 613
స్వార్థాలు నిండిన
స్వప్నాలు ఎరగను ....
అయ్యో ... అనే కరుణ
నిండిన పలకరింపులు గాని
కష్టాలను గుర్తించే
కనీస భావనలు కాని కాన రావు.....
విత్తే విత్తనాల నుండి
ఎదుగుదలకు ఎరువులు
కీటకాలకు
మందులు వేస్తూ
చంటి పిల్లల సాకినట్టుగా
సవరిస్తూ పోతూంటాం ......
చుట్టమోలే వచ్చే కరెంటును
కనిపెట్టుకుని.... అడుగంటిన
జలవాహినిని అక్కర పూర్తి
వాడుకుంటూ ఆపసోపాలు పడి
ఆరుతళ్లు పెట్టుకుంటాము .....
ఎండ కెండుతూ ....
వానకు నానుతూ......
చలికి వణుకుతూ....
పగలూ రాత్రీల తేడాలు లేకుండా......
విష పురుగుల బారిన పడకుండా
ఆరుగాలం కష్టించి
అరవ చాకిరీలు చేస్తే కానీ
అర కొర గింజలు చేతికి రావు.... .
అప్పుడు అసలు కథ మొదలయి ......
బెల్లం మీద ఈగల్లా
కపటబాజీ దగాకోర్లు
కరుడు గట్టిన పక్కా బ్యారగాళ్ళు
నెనరు లేని దళారులోచ్చి .....
మాయ జేసి ... మతులు
పోగొట్టే మతలబులు చేసి ...
అసలు కన్నా ....వడ్డీ ముద్దులా....
పిండి చేసి పండించిన చేతికి ....
ఆకలి నోటికి అడ్డుగా ఫోర్క్ లా నిలిచి
ఇటు మా కడుపులు కొట్టేసి ......
మసి బూసి మారేడులు చేసి
అటు జనాల జేబులకు చిల్లులు
పొడుస్తుంటే .... భారమయిన
గుండెలతో .... తీరం దాటని
తూఫానే అవుతుంది ....
మా మనసు.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment