మాఘమాసంలో
తేదీ : 12-02-2021
శీర్షిక : కొత్తపెళ్లి కూతురిలా....
సంఖ్య: 608
ఋతువు సంధి సమయాన
బతుకునీయ వచ్చే మాఘమై....
మఖ నక్షత్రయుక్త శశి అరుదెంచ
మాఘమై విలసిల్లె మహిలోన......
మునగ దీసుకున్న హేమంతము
అడ్డు తొలగగానే..... మంద్ర హాసమున
తొంగి చూచిన శశిరమున మధుమాసమై
ఏతెంచె మాఘమాసం......
హరిహరులకు అత్యంత ప్రీతియైనను
చదువులతల్లి జయంతి శ్రీ పంచమి...
సూర్యనారాయణుని జయంతి రథ సప్తమి...
పర్వదినమై పదిలమాయె ఈ మాసములోనే ....
సంధికాలమై సన్నుతించె
మిశ్రమ వాతావరణముల
వింత గొలుపు మది మదిన
మంచి పనులకు కొంత ముహూర్తములై.....
కంచు కోటలై కరవాలామెత్తనున్న
దినకరుని కిరణాల తాకిడికి జడిసి
వెనకడుగు వేస్తున్న
మంచు తెరలతో
ఇన్నాళ్లు తలంటి పోసుకున్న తరువులు
పండిన పత్రములను దులుపుకుని.....
సరికొత్త చివుళ్ళతో సమాయత్తమాయె
ప్రకృతి కాంత కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబౌతూ.....
నగునూరి రాజన్న
కరి నగరము
No comments:
Post a Comment