పల్లెతనం
తేది: 27-04-2021
శీర్షిక: పాల పాయసం...
కవిత సంఖ్య: 650
పుట్టినూరు ముచ్చటంటే
పురివిప్పి నాట్యమాడె పాణం
బాల్యంలోకి పడి పడి పరుగెత్తి
పండ్లన్ని ఏరుకొని పరగడుపున తిన్నట్టు....
తొలకరిలో పచ్చదనంలా
కలుషితాల మాటెరుగని
కల్మషాల ఆనవాళ్లెరుగని
పుట్టినప్పటి పసితనపు తత్వాలు...
బోసినవ్వుల పాపాయిలలా
బుల్లి బుల్లి మాటల బుడతల్లా
బుడి బుడి అడుగుల బుజ్జాయిలా
ఒకరికొకరై పలకరించుకోవడమే....
అరమరికలు లేకుండా
అచ్చమయిన వరుసలతో
అంతా వసుధైక కుటుంబమై
పిలుసుకునే బంధుత్వాలే ....
కల్లబొల్లి తనమెరుగని
కపటత్వాల మూలలెరుగని
కష్ట సుఖాలు పంచుకునే
కలియుగ బోళాశంకరులే...
పుట్టి పెరిగిన పల్లెతనమంటే
బతుకుదెరువు బాటల్లో
కాట గల్సినోళ్లంతా మల్ల కలుసుకుని
పాల పాయసం తిన్నంత కమ్మన....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment