Saturday, July 31, 2021

వేకువ పుష్పం తేది: 06-04-2021

 వేకువ పుష్పం 

తేది: 06-04-2021
శీర్షిక: నిత్య నూతనం 
కవిత సంఖ్య: 635

వేయి రాత్రుల చీకటైనా వెళ్లిపోవాల్సిందే 
వేకువ పుష్పం వెలుగులు పంచాల్సిందే 
కువకువల పక్షిరాగాల తొలి మంచులో 
అరుణారుణ వర్ణాలను నింగికద్దుతూ.... 

పట్టుగొమ్మలయిన పల్లె బతుకుల్లో 
పచ్చపచ్చని పంటపొలాల మీదుగా
పశుపక్ష్యాదుల కమ్మని రాగ సుధలు
వెచ్చని కాంతులు వెదజల్లుతూ .... 

తరువుల పైనుండి తరిమే 
చల్ల చల్లని పవన వీచికలు 
సుగంధాలను  మోసుకుని 
నూతనోత్తేజాలను విసురుతుంది.... 

అల్లనసాగే సెలయేటి గలగలలు
అమృతమొలికించే నదీమతల్లులు 
ప్రకృతి మాత పవిత్ర ఒడిలో 
సేద దీరుతూ ఆర్ఘ్యమిచ్చి ఆనందాలు 
పంచుతుంది..... 

ఆయనాలు ఋతువులు పక్షాలు
ఎన్ని మారినా ప్రతి రోజు ఓ సరికొత్త 
ఉదయాలను పరిచయంచేస్తూ 
భువిపై నిత్యనూతనమై వెలుగులీను
వేకువ పుష్పం.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment