చిత్ర కవిత
తేది: 26-03-2021
సామాన్యుడు .....
భానుడి భగ భగలు దాటుకుని
వాలిన సందె పొద్దుల వయసులో
కాలమనే జీవిత నౌకను ఈదుతున్న
జీవన పోరాట ఆత్మ నిర్భరకుడు ......
దయా దాక్షిణ్యాలు కరువైన లోకంలో
పొద్దులతో నిద్రకుపక్రమించలేని పేదవాడు
ఎక్కి తొక్కే పిక్క బలం లేకున్నా
తనువంతా తండ్లాడి ఈడుస్తున్న
కార్మికుడు......
కన్నవారున్నా... కరుణ లేని
కసాయి మనుషులై పోయారేమో
ముదిమి వయసులో ముప్పు తిప్పలు
మూడు ముద్దలు సాధించుకోవడానికి...
తనకు రాని చదువులో రాసున్న రాజ్యాంగం
తనకేమిస్తుందో దర్శనమీయని ధర్మం
తనకు తప్ప అందరికీ పంచే న్యాయం
రెక్కాడితే కాని డొక్కాడని బక్క పాణం ....
నాయకుల మాయా మానిఫెస్టోల్లోనో
ఓట్లముందు ఛాయా చిత్రాల పాట్లల్లోనో.... తప్ప
మాటమాత్రపు సాయమందించలేని
మర్మమెరిగిన పాలకుల మాటల్లోనో ....
సాధారణ సామాన్యుడు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment