Monday, July 26, 2021

ఆశల వాకిలి 03-02-2021

 ఆశల వాకిలి 

శీర్షిక : ఊపిరులు.... 
కవిత సంఖ్య: 602

ఆశలే కద మనిషికి ఊపిరి 
బతుకు బాటకు గమనం 
భవిష్యత్తుకు చక్కని చుక్కాని 
ఆశయాలకు మూలం..... !

ఆశలు అదుపుల పరిధిలో 
అలంకరించి ఓలలాడితే
అందాలను ఒలకబోస్తూ
ఆనందాలను చిలకరిస్తాయి... !

ఆశలు అత్యాశలయితేనో...
పేరాశలయి పెనుగులాడితేనో.....
దురాశలై దునుమాడితేనో.....
స్వార్థాలను సంకనేసుకుని 
సవారీ చేస్తేనో........
అసలు చిక్కులు ఆరంభం ..... !

పరిస్థితులో పరివార మిత్రమో 
పురికొలుపే చిత్రాలు కొన్నయితే 
పాశ బంధాలు పాదుకొలిపే 
అంతరంగాల అనంత సాగరాలు 
ఇంకొన్ని..... !

ఏది ఏమైనా ..
నేలవిడిచిన సాములు కాకుండా
అంబరాల నిచ్చెనలు వేయకుండా 
వివేకాలను తోడు నిలుపుకుని 
విచక్షణలను వెంటేసుకుని 
విహరిస్తే జీవితమంత  సప్తవర్ణ శోభితమే .... !


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment