Saturday, July 31, 2021

కఠిన శ్రమ తేది: 11-04-2021

 కఠిన శ్రమ 

తేది: 11-04-2021
శీర్షిక: హాలికుడు. 
కవితసంఖ్య : 105


పీఠభూమి రైతులకు 
పితలాటకమే ఎప్పుడూ 
కాలువ నీళ్లుండక కరెంటు 
కష్టాలోక పక్కన విత్తనాలు 
ఎరువులు మరోపక్క సన్నాయినొక్కులు....  

పంటలెప్పుడు ఏద్దామన్న 
చేసిన పాత అప్పులు తీరవు  
కొత్త పంటలేద్దామంటే 
పతారాలన్నీ వెక్కిరిస్తుంటాయి ...

భూసార పరీక్షల సాయమో 
సాంకేతిక సలహాల విలువలో 
ప్రభుత్వ యంత్రాల సహాకారాలో
సలీ సప్పుడు లేకుండా సర్కారు ఫైళ్లలో 
ప్రతి ఏడు పాకులాడు తూనే వుంటాయి.... 

అరకదున్నే హాలికుడు
ఆరుగాలం కంటికి రెప్పలా 
పంట కాపాడుకుంటుంటే 
అతివృష్టి అనావృష్టిల కల్లోలం ... 

చీడపురుగులు పంట దిగుబడిపై 
దళారీల పీడ రైతు ఎదుగుదలపై 
సమ్మెట పోట్లలా బాదుకుంటూ
సవాలు విసురుతున్నాయి .... 

కఠోర కష్టాలన్నీ దాటుకుని 
ఇష్టపడి నరనరాన జీర్ణించుకుని
పంటలే ప్రాణంగా నిలుపుకుని 
నష్టాల కబంధాలలో చిక్కుకున్నా... 

ధన మాన ప్రాణ కఠిన శ్రమలకోర్చి 
భగవత్ స్వరూపమై కదులుతున్నందునే 
కోట్ల జనాభా ఐదువేళ్ళు నోటికందించి 
ఆకలి మంటలను చల్లార్చుకుంటున్నాం ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment