అంశం: హద్దుల రేఖ
తేది: 22-11-2020
శీర్షిక : రేఖా మాత్రపు హద్దు...
సంఖ్య: 49
మనసే మనిషికి సరిహద్దు
మనిషి మనిషికి మాటే హద్దు
మనసు వినకపోయినా
మాట తూలినా మాటు వేయు
సుద్దులు తప్పి హద్దులు దాటు ....
దశాబ్దాలు ...శతాబ్దాలు దాటినా
స్వార్థాలు విడనాడని సరంగుల్లా
కపట బాజి కరటక దమనకులు
మనిషి తోలు కప్పుకున్న మృగమై
కంచె నీడన కసాయిగ నిలిచె.....
కొండా కోనలే కోణంగి నేస్తాలుగా
వాగు వంకలే వసతి సౌకర్యాలుగా
చిన్న చిన్న డేరాలే మిణుకు మిణుకు ఆశలై
అమ్మానాన్నలు ఆలి పిల్లల జ్ఞాపకాలే
మనసు తెరన మయూరాల ముచ్చట్లుగా......
మంచు తెరల చలి దుప్పట్లతో
ఎండ వానలే ఎదురయ్యే బంధువులుగా
పగలు రాత్రుల తేడా లేని పహారాలతో
ప్రకాశిస్తున్న మన సైనికుడు భగ్గుమంటున్న భానుడై...
మనిషికైనా మనసుకైనా దేహమైనా
దేశమైనా రేఖా మాత్రపు హద్దులుంటేనే
ముద్దు ముద్దు ...పల్లవించు ప్రమోదము
వెల్లువెత్తు మానవత్వం పరిమళించు మితృత్వం....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment