Sunday, July 25, 2021

నీటి పుట్ట తేది: 16-12-2020

 నీటి పుట్ట 

తేది: 16-12-2020
శీర్షిక : జీవకోటికి ప్రాణం. 
సంఖ్య: 581

కొండా కొనలే జన్మస్థలం 
వాగు వంకలే పయనం 
జంగల్ జమీన్లు ఎల్లబారి 
సంద్రమే చేరు గమ్యమై .... 

చెట్టుకు చేమకు చేవ 
మనిషికి జీవకోటికి ప్రాణం 
పుడమంతలో మూడొంతులై 
పుణ్యమూర్తిగ పురుడుపోసుకుంది .... 

భూమాతయే ప్రాణదాతయై 
భువిన జలమును వడియగట్టి 
భూగర్భమున జలమందించి 
ప్రాణకోటికి పవిత్రమైనది ..... 

పాలిథీన్లను ఫలహారంగా 
ప్లాస్టిక్కులే భోజనాలుగా 
కలుషితాలు కాలుష్యాలే
కాలమాన నివాసాలుగా ..... చేసుకుని 

సంపదల మీద శ్వాసలు నిలిపి 
ఆరోగ్యాలను ఆవిరి చేసుకుంటు 
అటకెక్కించుకుంటున్న మనిషి
ఆటవికతలను మరిపిస్తూ.....। 

పట్టింపులు లేని ప్రజలు 
ప్రణాళికలు లేని నాయకులు 
గమ్యమెరుగని గణాలు 
లంగరు లేని పయనం .... 

తిలా పాపం తలా పిడికెడు 
అలా అలా ఓ చేయివేసి 
తరుముతున్నారు జీవకోటిని 
కల్తీ పెనుభూతం వైపు ..... 

కనువిప్పులు కలిగించుకుని
తనువు క్షేమం తగిలించుకుని
చైతన్యాల చెంగల్వ పూవులై
చేదోడవ్వాలి ప్రకృతి మాతకు.... 


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment