Wednesday, July 7, 2021

మానవి 13-11-2020

 అంశం: మానవి 

తేది: 13-11-2020
శీర్షిక : అమృతవర్షిణి
సంఖ్య : 561

ఆలనా పాలనలలో అమ్మైనా 
నాన్నైనా... ఇద్దరు జోడిగా కలిస్తేనే 
సాకారమవుతుంది సంసార నౌక... 
అయినా.... 
పిల్లల పెంపకంలో అమ్మదే పైచేయి .... 

అతివంటే అవనికి ప్రతిరూపం 
ఆత్మీయతలకు చిరునామా 
అమృతం చిలకరించే కలశం 
అనురాగాలు పండించే ఆమని .... 

పుట్టింట మురిపాలు ఎంతో 
మెట్టింట బాధ్యతలు అంత 
సహనం సంతరించుకుని 
ఇంటిల్లిపాదినీ తీర్చి దిద్దుతుంది... 

మాతృస్వామ్యంలో వెలుగులీనినా 
మబ్బులు కమ్మిన చంద్రునిలా 
మరుగున పడిన సూర్యుడయ్యింది
మగమహారాజుల  పెత్తనములో .... 

బాల్య వివాహాల బలిదానాలు 
సతీ సహగమనాల సవాళ్లు 
అన్నీ అధిగమించి ఆరితేరి 
నింగికెగిసి దూసుకెళ్తుంది రాకెట్టులా.... 

అన్నీ సమానమేనంటూ మాటల
అలవోకల చిలుకపలుకులే గాని 
చేతికి చిక్కరు చేతకు దొరకరు 
అధికారం పాత్రను అందనీయరు..... 
అయినా ఆమె ఇంకా అమృతవర్షిణే.... 

నగునూరి రాజన్న 
కరినగరము. 

No comments:

Post a Comment