Sunday, July 25, 2021

సహన పరీక్ష తేది: 08-12-2020

 సహన పరీక్ష 

తేది: 08-12-2020
శీర్షిక: ప్రకృతి భీభత్సం 
సంఖ్య : 

అనుక్షణం ఆరాటమే ప్రకృతికి 
పాఠాలు నేర్పాలన్న పోరాటమే 
గాలి కదలికలో వాన రాకడలో
ఎండ తాకిడిలో వణుకు చెణకులలో.... 

ప్రకృతిలోని ప్రతి కదలికలు
ప్రతిస్పందనల గుణపాఠాలే
పరికిస్తే ప్రతి క్షణం బోధనలే
పాటిస్తే జీవితం మణిమాణిక్యాలే.... 

పోడు ఎవుసమంటూ చెట్లను
పొట్టన  పెట్టుకున్న సంగతులకు  
పొట్లం కట్టి అప్పజెప్పుతూనే ఉన్నది
పెను ఉప్పెనలను అడపా దడపగ..... 

ఇంధనాలు గ్యాసంటూ 
ఇబ్బడి ముబ్బడిగ తోడేస్తుంటే
ఇబ్బందులేనాయె అవి ఇడిసిన 
విషవాయువుల తోడ ఆరోగ్యాల జల్లెడ.... 

ఇసుక గ్రానైట్లను ఇరగ మరగ వాడేస్తూ 
ఇరుసున తిరిగే భూగోళాన్ని 
గాడి తప్పిస్తున్నం ....నిర్మలమైన
జంతువుల ఆవాసాలను చెదరగొట్టి
జనావాసాలపైకి జబర్దస్తీగ పంపేస్తున్నం... 

వాగులు వంతలన్నీ ఎండబెట్టి
వరుసగ జీవనదులను నిర్జీవాలుగా
మార్చేసి ప్రకృతి పైన దాడి చేస్తుంటే 
మరిచిపోతుందని భ్రమ పడుతున్నారా? 

అంతులేని వింత వ్యాధులను 
సంతరించి కానుకలు చేస్తుంటే
కొంతైనా గ్రహించి ఆపన్న హస్తమై
అండగా నిలిచి మేలు కోరుదాం ..... 


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment