Monday, May 20, 2024

భావ వీచికలు తేది : 16-05-2023 శీర్షిక : హొయలొలికే రూపం

 భావ వీచికలు 

తేది : 16-05-2023
శీర్షిక : హొయలొలికే రూపం 
సంఖ్య : సహస్రాధికం 

కంటితో మమేకమైన కమనీయమో  
చెవికి సోకిన చిరస్మరణీయమో 
ప్రకృతి పండించిన మనోహరమో ... 
లెక్కలేనన్ని సంఘటనలకు 
లెక్కకు మించిన భావవీచికాలెన్నో  
సదా రొద పెడుతూ ... మేధో 
మధనానికి నాందీ పలుకుతాయి ... 

మనసు కాన్వాసుపై మరులుగొలిపే 
సప్తవర్ణాల ఊహలన్నీ కుమ్మరించి 
సదా చెవిలో రొదపెట్టి ఊదరగొడుతాయి  .... 
తీరైన రంగుభవనంలా తీర్చి దిద్దమని...
లేదా మరకత శోభలద్దుకున్న మనోకావ్య 
దృశ్యావిష్కరణమో  ...చేయమంటూ .... 

రాగద్వేషాలను రంగరించుకుని 
భావావేశాలను మాలలుగా  గట్టి 
చైతన్య దీపికల పరిమళాలు చిలకరించి 
హొయలొలికే రూపమియ్యమంటూ  ..... 

కొన్నిసార్లు మొరాయించినా ... 
మరికొన్నిసార్లు మంత్రమేసినట్టుగానే 
మహామాయి ఆశీర్వచనమో ఏమో 
గండ శిలలను చెక్కే శిల్పి చేతిలోని ఉలి
చెక్కిన చక్కని శిల్పంలా కుదురుగా 
వస్తుంది..... 

పండక్కి కట్టిన మావితోరణంలా 
వర్ణమాలలోనుండి వరుసగట్టి 
పదాలన్నీ పొందికగా గుమికూడి 
ఇంపైన సువాసనలు చిలకరిస్తాయి .... 
పండగ శోభలను పసందుగా 
ఇనుమడిస్తాయి .... 

సత్యాన్వేషణలో నిష్టగా 
ధర్మంలో మర్మమెరిగి .... 
న్యాయంలో  నగారా మోగించి  
పాఠకుణ్ణి ఆకట్టుకుంటేనే 
పటుతరమై శోభిస్తుంది ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment