Friday, November 5, 2021

నేను కవిత్వమయ్యేదాక తేది: 29-09-2021 శీర్షిక: అమ్మ దీవనలు

 నేను కవిత్వమయ్యేదాక

తేది: 29-09-2021
శీర్షిక: అమ్మ దీవనలు
కవిత సంఖ్య: 765

అమ్మ దీవెనలతో  మొదలైన 
అక్షరాల మహిమలు… 
నాన్న తోవలో నడయాడి పదాలై
గురువుల దీవెనలతో వాక్యాల దివిటీలై 
బతుకుబాటలో గమ్యపు మార్గదర్శకాలైనయి…. 

చదువుల గంగలో మునకలేసినప్పుడు
కలగాపులగమైన ఉద్యమాల సుద్దులతో 
జీవన గమనంలో ఎదురైన నిత్యకృత్యాల 
పరిశీలనలతో పరిమళింప చేసుకుని…. 

మాతృసంస్థలో మసులుకున్న పరిసరాలతో 
అంతరంగము లోలోపల అలల రూపంలో 
రూపు దిద్దుకున్న కవితా ధోరణులు 
మెరుగులు దిద్దుకుని తోరణాలైనాయి. 

వాడవాడల తొంగి చూసే అవకతవకలో 
ఊరూరన ఊపిరిలూదే పౌరుషాల తల్లివేర్లో
పల్లె పల్లెన పాటలయ్యి విరిసే పూదోటలో
ఆనోట ఈనోట వినిపించే మోహనరాగాలో
అల్లుకుంటూ ఒకటొకటిగ పేర్చుతున్నా …. 

ధవళ వస్త్రాల నీడల్లో తచ్చాడే స్వార్థాలో
అధికారాల సంకెళ్ళలో ఇరుక్కున్న అమాయక
చక్రవర్తుల పరిస్థితులో…. కల్తీల నీడలలోని
కలుపు మొక్కలో… కాచి వడబోయాలని …. 

రైతే రాజంటూనే… రాచ మర్యాదలు 
కాదు కద కనీస విలువలీయని మానసాలను…
ఆకలి దప్పులకు అలమటిస్తూ రాత్రింబవల్లు
కంచె కావలి కాసే సైనికుల కష్టాలకు… కదం
తొక్కుతుంది నా కలం…. 

కాలుష్య భూతపు కారణ సంభవాలో 
కకావికలమయి గుండె లోతుల్ని పట్టి 
మెలి పెట్టి గునపాలు గుచ్చే కష్టాలనో… 
ఏకరువు పెట్టి … నా కవన గీతం 
లేపనాలద్దే సుగంధమౌతుంది. 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment