Wednesday, November 10, 2021

ఈ శ్వాస నీకోసం తేది : 26-10-2021 శీర్షిక : సాహితీ సేవలో...

 ఈ  శ్వాస నీకోసం

తేది : 26-10-2021
శీర్షిక : సాహితీ సేవలో... 
కవిత సంఖ్య : 783

ప్రభాత భానుని సంబరాలు 
పక్షుల కిలకిలా రవాలు 
వర్ణ రంజితమై అల్లుకున్న మేఘాలు 
సుందర మనోహర దృశ్యాలు ... 

సుమధుర కోయిల గానాలు 
చైత్ర వసంతాల ఆమనులు 
అల్లన కదిలే చల్లగాలులు 
పిల్లగాలుల అల్లరి చేష్టలు .... 

సాయం సంధ్యా సమాహారములు 
చుక్కల లోకమెక్కిన చక్కని చంద్రుడు
వెండి వెలుగుల జోల పాటలు 
సందడి చేసే జన సందోహాలు .... 

ప్రకృతిలో పల్లవించే పదనిసలే 
కాకుండా.. కాల గమనంలో కదిలించే 
కథలు కమామీషులు ....నేరాలు ఘోరాలు 
లంచగొండ్ల  మొండి తనం ..... ధవళ 
వస్త్రాల నీడల్లో తచ్చాడే  దగుల్బాజీ 
దళారీతనం.... 

ఘటనేదయినా ...గట్టిగా కదిలించిందో ... 
మనసు నిలిపి .... మేధో మధనం గావించి 
మన్ను తిన్న పామునయినా కదిలించే 
ప్రయత్నమే నాకు మిగిలిన
ఏకైక సాధనం .... 

అమ్మ నేర్పగా నన్నల్లుకున్న 
అక్షరాలతో బుడిబుడి  అడుగుల
పదాల తూణీరాలే  ... నిత్య సంతోషాలు ... 
సాహితీ సేవలో సదా నిలిచి సేద 
దీరాలన్నదే సంకల్పం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment