దుర్గాష్టమి
తేది : 13-10-2021
శీర్షిక : తెలంగాణ సంబురం
కవిత సంఖ్య : 776
ఆచారాలు సంప్రదాయాలు అటకెక్కే ...
వందలేండ్లు వలస పాలకుల రాక్షస
ఉక్కు సంకెళ్ళలో బిక్కు బిక్కు మన్న
పానాలు .. దక్కను పీఠభూమిలోన ....
భారమైన బతుకులకు అక్షరాస్యతలు
కరువై .... నాగరికతలే ప్రశ్నార్థకమై ..
వేదమంత్రాలు ... ఉపనిషత్తులు
చదవకపోయినా ... మంత్రాలు
వల్లించలేకపోయినా ... తంత్రాలు
తెలియకపోయినా ... కుళ్ళు కుతంత్రాలు
కపట నాటకాలు తెలియని....
స్వచ్ఛమైన సెలయేళ్ళు వారి మనసులు...
కన్న బిడ్డలను కాపాడుకునే ఆరాటంతో
అమ్మను పూని పౌరుషాలు స్మరించుకుని
బతుకు మీద బహు చక్కని పాటలు కట్టి
భరోసాలు నింపుకున్న తెలంగాణీయులు ....
కష్టాలకు కళ్ళల్లో రక్తం కార్చుకున్నా ...
బాధలను బంతిపువ్వుల్లా భరించుకున్నారే కానీ .....
తమ బతుకుల సౌకర్యం కొరకు అవతలివారిని
ఎప్పుడూ బలి చేయని .... బాధ్యత గళ్ళ పౌరులు ...
శరన్నవరాత్రుల్లో తల్లి దుర్గాదేవిని
ఆడంబరాలు లేని ఔషధ గుణాల
గునుగు తంగెళ్లతో అందమైన కట్ల ...
అలరారే చిట్టి గోరంటలతో అమ్మ పాదం
మోపిన శ్రీచక్ర రూపంలో అలంకరించి...
కష్ట సుఖాలను ఏకరువు పెట్టుకున్నారు
పాటల రూపంలో... ఆడి పాడి అలుపులు
తీర్చుకున్నారు ... ఆనవాయితీగా
మార్చుకున్నారు ....తెలంగాణా సంబురం ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment