:ప్రభాత కిరణాలు
తేది : 15-09-2021
శీర్షిక : బతుకు బాట
కవిత సంఖ్య : 753
చీకటి దుప్పటి కప్పుకున్న రాత్రి ....
ప్రభాత కిరణాల రాకను పసిగట్టిన
విహంగాల కువకువలు హెచ్చరికలు
జారీ చేయగానే మెల్లగా జారుకుంది ....
తొలి పొద్దులో బంగారు కిరణాలతో
ముద్దుముద్దుగా బయలుదేరి ....
కొండా కోనా చెట్టు చేమ గొడ్డు గోదలను
పలకరిస్తూ పల్లెలు పట్నాలను
తట్టి లేపుతాయి .....
పచ్చ తివాచీలా పరుచుకున్న
గరకవనంలో కూడా దూరిపోయి …
రాత్రి చల్లదనంలో మూటకట్టుకున్న
ముత్యాల్లాంటి మంచు బిందువులను
కూడా పలకరించి మాయం చేస్తాయి ....
కిరణాలు వెలుగులు చిలకరించగానే....
నిశీధిలోమత్తుగా జోగిన ప్రతి అణువణువు
వాగు వంక రాయి రప్ప పూవు కాయలను
సృషిస్తూ చైతన్య బాట పట్టిస్తాయి ....
కాల పుస్తకములో మరో కొత్త పేజీకి
సమాయత్తం చేస్తూ గ్రంథంలో
తాను ఇమిడిపోతూ జీవరాశికి
బ్రతుకు బాటలు చూపిస్తాయి ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment