Friday, November 5, 2021

అడుసు తొక్క నేల తేది : 22-09-2021 శీర్షిక : ముదిరిన చక్కర వ్యాధి

 అడుసు తొక్క నేల 

తేది : 22-09-2021
శీర్షిక : ముదిరిన చక్కర వ్యాధి 
కవిత సంఖ్య : 44+ 8

రాను రాను రాజు గుర్రంలా… 
ప్రజాస్వామ్యాల పేరు చెప్పి 
ఫక్తు ఫాసిస్టు విధానాలు 
పాటిస్తున్నారు కొంతమంది …

సాటి మనిషి చల్లగుండాలనే 
మంచితనాలను కొంచం అలుసుగా 
తీసుకుని... పచ్చినెత్తురుకు మరిగిన  
పశు వాంఛల..మేక వన్నె పులులను 
పట్టి బంధించక కొంత కరుణ చూపగా…
కాటేసే నాగుబాములై వాటేసుకోవట్టె ... 

మొక్కై వంగనిది మానై వంగునా…
లక్కింటి దహనాన్ని ఆపనందునే 
కురుక్షేత్రమై ఏకంగా కులనాశనానికే 
కారణమయ్యింది…రాజకీయాలకతీతంగా 
న్యాయదేవత నడిచిరావాలి శిక్షించ... 
కదలి రావాలి ధర్మ దేవత కళ్ళు తెరచి 
కపట నాటకాలు చూడ .... 

అడుసు తొక్కనేల కాలు కడగనేల 
అనుకుంటే..అమ్యామ్యాల మేతలకు 
అలవాటుపడ్డ అధికార దొంగ గొడ్లతో 
అంగాంగాలన్నీ  నిర్వీర్యమై నిలువు 
గుడ్లేసుకుని చూస్తుంటే... ఆత్మీయతల 
అధికార దండం అండదండలై
కాపు కాస్తుంటే... ముదిరిన చక్కర వ్యాధికి…
మురిగిన కాలు ముచ్చటే అవుతుంది... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment