Friday, November 5, 2021

నీవు నేర్పిన విద్యయే .... తేది : 22-09-2021 శీర్షిక : అసలు మనిషి తత్వం ...

 నీవు నేర్పిన విద్యయే ....

తేది : 22-09-2021
శీర్షిక : అసలు మనిషి తత్వం ..... 
కవిత సంఖ్య : 759

నీవునేర్పిన విద్యయే నీరజాక్షా అంటూ 
అప్పచెప్పడం ఆనవాయితీ అయినా .... 
అందులో దండి మర్మాలు ఎన్నో 
ఇమిడి ఉంటాయన్నది అక్షర సత్యం .... 

పుట్టి బుద్దెరిగిన నాటి నుండి 
అమ్మ ఒడిలో ఆడుకుంటూ 
అమ్మా నాన్నలను అనుకరిస్తూ 
తోబుట్టువులను అనుసరిస్తూ .... 

బంధు మిత్రులను పరికిస్తూ 
పరిసరాల ప్రభావాలను పరిశీలిస్తూ 
కాల మార్పులను కంట కనిపెడుతూ 
మనకు మనం తీర్చి దిద్దుకుంటూంటాం ..... 

కోయిల గుడ్లను కాకి పొదిగినా 
మధుర గానాల గొంతు మూగపోనట్టే ... 
అంతరంగపు తీవ్ర భావాలు 
సొంత బాణీలను మరిచిపోక 
సందర్భోచిత సహజ గుణాలతో  
ప్రదర్శితమౌతూనే ఉంటాయి ..... 

అందరి మాటలు వినినా  
అందరి చేతలు చూచినా 
అనువుగా పరిస్థితులను 
అన్వయించుకుంటూ .... 
ఆర్యోక్తిని అప్పచెప్పడం ఆనవాయితీ ... 
అదే అసలు మనిషి తత్వం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment