విమోచన వేళ
తేది : 17-09-2021
శీర్షిక : దక్కను పిక్కటిల్లింది ....
కవిత సంఖ్య : 755
దక్కను పీఠభూమి పిక్కటిల్లి
ఏడ్చింది ఆనాడు ..
పాలకులు పాలకులు
తన్నుకుంటే పట్టించుకునే వాళ్ళు కాదు.
పాలకులే ప్రజల మీద పలు
(90) రకాల పన్నులేసి
ప్రజలను పజీత చేసి
ప్రాణాలను హింసించి
మానాలను మంట కలిపిన రోజులు ...
ఒక్కొక్కటి రాయాలంటే
ఒడువని ఎడతెగని ముచ్ఛటే….
ఓరకంట ఏడుస్తున్నది కలం....
సామూహిక మానభంగాలతో
సగం చచ్చి బ్రతికిన జనాలు ఆనాడు ....
వందల్లో శవ దహనాలు
వల్లకాడులే పల్లెలన్నీ …. లూటీలు…
నరహంతక రజాకార్లతో అట్టుడికి
అల్లాడినది ఆనాడు తెలంగాణా ....
చిన్న చిన్న సెలయేళ్ళన్నీ
వాగులో చేరి .... పెద్ద మానేరై ...
గోదావరికే ఉపనదిగా నిలిచి
సముద్రమంత ఉప్పెనైనది .....
వేయి గొడ్లను తిన్న రాబందైనా
వేళ వస్తే నేలకొరగాల్సిందే ....
ఊరు వాడ అంతా ఒక్కటైంది
ప్రతి జిల్లా ఓ ఖిల్లా అయింది .....
ప్రజలను రాచి రంపాన పెట్టిన
ప్రగల్బాల రాజులంతా నాటి
ప్రజా ప్రభుత్వ పెద్దల పాదాలనంటి
వారి ప్రాణాలు నిలుపుకున్నారు ....
ఏమైతేనేం .... చివరికి
ధర్మం గెలిచింది ...
న్యాయం కలిగింది ...
సత్యం నిలిచింది ....
దక్కను కష్టాలు తీరినవి ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment