అప్పుడప్పుడు
తేది : 24-09-2021
శీర్షిక : నిశ్శబ్ద పోరాటము
పోటీ ప్రపంచములో నెగ్గాలనుకుని
పట్టుదలతో పరుగు లంఘించి
అహోరాత్రులు కష్టపడి అన్నీ కూడబెట్టా
ఒక్కటేమిటి.... అదీ ఇదీ కాదనకుండా
అడిగినదేదీ లేదనకుండా ఆస్తులు
అంతస్తులు....
అయినా అప్పుడప్పుడు మరెందుకో
మనస్సు నిశ్శబ్దపు పోరాటం చేస్తున్నది...
కాలపు పరుగులో కానక పోయిన కమ్మని
సంగతులు పోగేసుకుని పోరాడమంటూ ...
అమృత సమమైన అమ్మలాంటి
ఆత్మీయతల తోటలో విహరిస్తూ ….
తోబుట్టువుల అనుబంధాల పందిరి
నీడలలో శ్వాసిస్తూ సేదదీరమంటూ….
అనురాగపు లాలనల ఫలాల
మాధుర్యపు రుచులు చూడమని…
బంధుమిత్రుల సెలయేళ్ళ నీటితో
దాహం తీర్చుకోవాలంటూ…..
పచ్చని తివాచీలు పరుచుకున్న
ప్రకృతి మాత ఒడిలో పరవశించమని…
పరుగెత్తుతున్న ప్రవాహల పక్కన
గెంతుతున్న లేడి పిల్లో కుందేలు పిల్లో
అయిపోవాలని ఆశపడమంటూ….
తిరిగి చూసుకునేసరికి జీవితంలో
నిస్సారములా...ఎడారిలో పయనంలా
అన్నీ ఉండి ఎవరూ తోడులేని
ఒంటరితనం నన్నావరించినట్టుగా….ఉంది…
ఎవరో నన్ను వెక్కిరించినట్టుగా అనిపించి
అపరాధ భావనలతో గుండె బరువెక్కినది….
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment