వెలుగు దివ్వెలు
తేది : 09-11-2021
శీర్షిక : మెరుగైన ప్రతి అడుగు
కవిత సంఖ్య : 793
పుట్టుక నుండి పుడకలవరకు
అడుగడుగున ప్రతి అడుగులో
నడకలు నేర్పి నడతలు తీర్చి దిద్ది
నాగరికతలకు నాందీ పలికిన వెలుగులు ....
భయం భయంగా గర్భ కుహారంలో
అంకురమైన సంచారారాలకు
నిర్భయంగా లోకం చూపి.. తోడై
నీడై నిలిచిన మాతృ మూర్తులు .....
లోకం తెలియని ప్రాయాలకు
పడిపోకుండా అడుగులు నేర్పి
తడబడకుండా నడకలు నేర్పి
జీవిత మార్గ నిర్దేశాలందించే నాన్నలు ....
సుద్దులు తెలియని ముడి ముద్దకు
సుందర రూపమిచ్చి నైపుణ్యాలకు
నలుగులు పెట్టి... కలలకు రంగులద్ది
జ్ఞానాలకు అడుగులు వేయించిన
దిక్చూచులు అక్షరమూర్తులు ....
నిశి చీకట్ల అజ్ఞానాలను చీల్చి
చెండాడి శుభ వెలుగుల మెరుగులు
దిద్దే ప్రతిపదం ప్రతి అడుగు... ప్రతి
పవిత్ర కాంతిరేఖ ...వెలుగు దివ్వెలే ...
భయాల గుప్పిట నుండి బయటపడేసి
ఎప్పటికప్పుడు వెలుగుల ధైర్యాలను నింపుతూ
నైపుణ్యాల తోటలో పరిమళాలద్దుతూ
సంస్కారాల మాలలు ధరింపజేసే
ప్రతి సంస్కృతి, ఆచారం, సంప్రదాయం
మన పాలిట వెలుగుల దివ్వెలే ....
కాంతి రేఖలు నింపుతూ కడలి నిండా
సాగుతూ ..కదిలే కార్తీక దీపాలన్నీ...
ఆధ్యాత్మికతలు జోడించుకున్న
అందమైన ఆశల హరివిల్లుల వెలుగుల దివ్వెలే .. ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment