చిత్ర కవిత
తేది : -19-09-2021
శీర్షిక : కలల అలలలో ....
కవిత సంఖ్య : 166
రంగు రుచి వాసనలు లేనిదే
అయినా రాలుగాయిలా మారి
దర్శించని ప్రదేశాలకు కూడా
దర్జా బాటలు వేసి పరామర్శిస్తుంది ....
తనకు రూపం ఉన్నదో లేదో కానీ
ప్రతి జ్ఞాపకాల నిధి నిక్షేపాల గని...
గుణ గణాల కాల వర్ణనలుంటే
రూపాలను సంతరించి సాక్షాత్కరించు ....
మేఘాలనే తల్పాలుగా చేసుకుని
విహారాల వింత యాత్రలు చేసి
ముచ్చటగా ముల్లోకాలను కూడా
చుట్టి వచ్చి ముతైదువలా వల్లించు ....
కలల అలలలో తేలియాడుతూ
కల్లబొల్లి కబుర్ల కాణాచిలా మారి
సప్తవర్ణాల స్వప్న సుందరాలను
సందర్సింప జేస్తూ సందడి చేస్తుంది ....
ఉల్లాసాలలో తేలియాడుతూ ...
ఆయాసాలలో మునిగిపోతూ ....
అసలు మనిషి బ్రతుకు బాటనే
చెప్పు చేతుల్లోకి తీసుకుని
స్వాధీనతలో .... నియంత్రిస్తుంది ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment