కాల మహిమ ....
తేది : 29-08-2022..
శీర్షిక : నిప్పులాంటి నిజం…
నడకల మీద తెలవాల్సిన నిజాలు
నిలకడమీద తెలుస్తాయంటే...ఏంటో .
సులువుగా అర్థం కాని సుందరమని
పరధ్యాన్నంగా
పక్కన పెట్టేసి ...
పనులలో లీనమయ్యేవాన్ని నాడు ...
అవసరార్థం చిన్న అబద్దమాడినా.....
ఆఁ... సంద్రంలో నీటి చుక్క ... పట్టదులే ....
ఎవరికీ వారే యమునా తీరిన లోకంలో...
చిన్న విషయములే కదాని సర్దుకునేవాన్ని ..
నాణ్యతకు పరిమాణం లెక్కకు రాకున్నా
నేనే గొప్పనుకుని కితాబులిచ్చుకుని
ఇక తిరుగులేదనుకుని జబ్బలు
చరుచుకుని మురిసిపోయిన రోజులు ....
పెద్దవాళ్ళ పేచీలకు...మన గోచీలెందుకని...
స్నేహ ధర్మాలు
శంకు చక్రాలని భ్రమించి ...
గుంటనక్కల తప్పుల తక్కెడలెన్నో ...
చూడనట్టు నటించడం నేర్చుకున్నా ...
తాత్కాలిక సముదాయింపులకు
షష్టమ ఇంద్రియం అరిచి గోలచేసినా
మొహమాటపు మెహర్బానీల పళ్లెం ఎత్తుకుని
సగం సగం మనసుతోనే సమ్మతించి రాగం
ఆలపించాను ...
వజ్రోత్సవాల వరకు గాని...మేక వన్నె పులుల
దిమ్మ తిరిగే వాస్తావాలు కొసిరి కొసిరి తెలు స్తుంటే
కాకలు తీరిన కాలమహిమ ముందు మౌనంగా
తలదించుకున్నాను ... మన కుప్పిగంతులు
అన్నీ తూచ్ ... అని తెలుసుకున్నా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment