Thursday, December 1, 2022

నివురు గప్పిన నిప్పు తేది : -03-08-2022 శీర్షిక : తీవ్రవాదం…

 నివురు గప్పిన నిప్పు

తేది : -03-08-2022
శీర్షిక : తీవ్రవాదం… 
కవిత సంఖ్య : 952

సమూహాలుగా బతికి సాధించారు 
జీవరాశిపైన ఒకప్పుడు ఆధిపత్యం... 
నాగరికతలో నాలుగు అడుగులు ముందుకేసి
మానవతలో పది అడుగులు వెనక్కిప్పుడు… 

ఎక్కడ మొదలై ఇంకెక్కడ ముగుస్తుందో
ఆత్మీయతల జాడలు అసలు కానరావు 
అనురాగపు తీగల ఆనవాళ్ళుండవు
భవ బంధాల పరిమళాల వాసనలుండవు… 
అంతా మాంసపు ముద్దల వ్యవహారమే... 

ఏమి సాధించడానికో 
ఎవరిని ఉద్దరించడానికో
శూన్యం నుండి శూన్యానికి పయనం… 
పక్కవాడిని ప్రశాంతంగా పడుకోనివ్వరు 
పొరుగువాడిని సుఖంగా జీవించనీయరు …. 

విశ్వమంతా భయం గుప్పిట బతుకులే… 
దేశాలన్నీ మేకపోతు గాంభీర్యాలే 
కొంతమంది వెంటబడి తరుముతుంటే ... 
మరికొంతమంది పెంచిపోషిస్తుంటే … 

చెప్పేవాడికి లేకున్నా చేసేవాడికి 
వివేకముంటే ఎంతో కొంత బాగుండు... 
బొంకు నేర్పుతున్న ముఠాలకు 
బోధనల పొంతన లేని సారాంశాలకు 
నీతి నియంత్రణల కరువులు… 

తినడానికి బన్ను సరిగ్గా లేకున్నా
గన్ను సంస్కృతులతో కొందరుంటే…
బాంబులున్నాయంటూ మరికొందరు… 
నేనే మానవ బాంబునంటూ వేరొకరు…
ఇవేవి చాలవన్నట్టు వింతరోగాల తేనెతుట్టలో
వికటంగా రాయి విసిరేసి….
విశ్వాన్నే వణికించిన వింత ధోరిణి… 
చచ్చి… చంపి…ఎవరి బాగు కోరుకుంటున్నట్టు .... 
ఏం బావుకుంటున్నట్టు…. 

నాడు వన్య మృగాలనుండి రక్షించుకున్నా 
నేడు సాటివారినుండి రక్షణలకే 
దేశాలకు నిత్యం సవాలక్ష  ప్రణాళికలు 
సమర్పితం దేశ సంపదలో సింహభాగం... 

మెతకతనం లేని మేలిమి బంగారుగుణగణం 
శౌర్య పరాక్రమాల శంఖం పూరింపులతో
వినమ్ర వీరత్వాల విల్లం ఎక్కుపెట్టే
సకల సద్గుణగణాల సార్వాభౌమత్వం…
మెడలు వంచి మంచి బోధించే వివేకం… 
ఎప్పటికైనా ఎనలేని సంపదలే….. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment