కర్ణ పిశాచి (చరవాణి )
26-09-2022
శీర్షిక : తెరల వాణి
కవిత సంఖ్య :
చిన్నంగ దూరింది వామనుడల్లే
ఇంతింతై వటుడింతై లాగా
ఆక్రమించింది అనంత విశ్వాన్ని
అన్ని వయసులు .. అన్ని తరగతులు ...
విద్య వైద్యం విస్తరించక పోయినా
పెద్దలకు పిన్నలకు పిడికిట విశ్వమై
అవసరాలకు, ఆనందాలకు
అమ్మ లాలి పాటలనుండి
అనంత విశ్వ రహస్య ఛేదనల దాకా
సమయ నిమగ్నతకు,సరదా వినోదాలకు
సమస్త విజ్ఞానాలకు,వికాస పరిణామాలకు
గూగులమ్మ గుస గుసలతో
సర్వులకు చరవాణే ప్రధానం....
ఆ తదుపరే అమ్మైనా నాన్నైనా ....
సాంకేతికతలు చంకలో దూరి
చరవాణి చక్రం తిప్పుతుంటే
ఆత్మీయతలు అటకెక్కి వెక్కిరింపులాయే ...
అంతంత మాత్రపు అనురాగాల
చిరునామాలు గల్లంతులే .....
మాటా మంతీ... మంచీ చెడుల
పరిశీలనలే లేని... చెరువులో
కొమ్ములు చూచిన బఱ్ఱెల బేరంలా
పలకరింపులు లేని కొనుగోళ్లు
అమ్మకాలే ...
తెరల చరవాణి తెచ్చే కదా
సౌలభ్యమని సంబరపడేంతలో ..
డేగల్లా వచ్చే హ్యాకర్స్ చేసే
బ్రోకర్ పనులు...కష్టార్జితాలకు
కన్నం వేసే కలియుగ తాంత్రికులు ....
మంచి వెనకే చెడున్నట్టు
అనేక సదుపాయాల సందళ్ళతో పాటు
అపాయాలు పొంచి ఉన్న మాట
వాస్తవం ...ఎప్పటికప్పుడు ఆవశ్యం ....
విజ్ఞానపు ఆధునీకరణలు ....
అతి సర్వత్ర వర్జయేత్ ....
ప్రతి క్షణం పారాహుషార్
ఒక్క క్షణం ఓపికగా ఆలోచించు
అడుగేసే ముందరే తొందరలేకుండా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment