ఆత్మీయతా సిరులు
తేది : 01-09-2022
శీర్షిక : ఒకప్పటి మాటే ...
కవిత సంఖ్య : 975
అరవైలలో నెలవైన బంధుబలగాలు
అసలు సిసలైన ఆత్మీయతా సిరులు
వల్లించుకుంటేనే తుళ్ళింతలమయం
వరసబెట్టిన నాటి అమూల్య అనుభవం
మేఘ సందేశంగా...అతిథులొస్తున్నారనే
ఆనంద వార్తలు "అర్ధం" విన్నా...చాలు
లేడి పిల్లలయ్యేది వెన్నలాంటి మనసులు
గాలిపటంలా గారాలు పొయ్యి తారాటలే...
తనువంతా మురిసిపోయేది....
సంతోషాల సరదాలు ఉక్కిరి బిక్కిర్లతో ...
ఉరుకులు పరుగుల ఆరాటాలసలు
లేని నాళ్లలో...ఉలికినా పలికినా ...
బంధు బలగమే ఆనాడు ... పట్టపగ్గాలు
లేని ఆనందాలతో పరుగులు పెట్టేది
పట్టరాని మనసు...లేగ దూడలయ్యేది
హృదయ డోలికలు ...
కాళ్లు చేతులు కదలాడక
కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు
చూసేవారు ...ఎదురేగి ఆహ్వానాలు
పలికి... కౌగిలింతల్లో కరిగిపోయేవారు ...
వర్షఋతువులోని చిరు మేఘంలా...
తటాకముప్పొంగి తన్నుకొచ్చే మత్ తడిలా...
కొండా కోనల్లో పరుగెత్తే సెలయేరులా
కంట నీరు ఉబికి చెమర్చుకునేవారు ..
పేద ధనికల బేధభావమెరుగక
స్వయానా కాళ్ల శుభ్రానికి నీళ్లిచ్చి .. .
కండువా చేతికందించి... కృష్ణ
కుచేలుల్లా కుశల ప్రశ్నలతో
కులాసాలు తెలుసుకునేవారు ...
ప్రయాణసాధనాల పరిమితులతో
రోజుల తరబడి బంధువులున్నా
కళ్ళకద్దుకుని ...కబుర్ల కాలక్షేపాలతో
ఉన్నంతలో ఉడతా భక్తిగా శ్రేష్టమైన
తినుబండారాలతో బలిమిచెలిమిల
తినిపించేవారు ...
వెన్నెల రాత్రుల వెలుగు పూలలో
నిద్రకుపక్రమించేముందు తొలివిడతగా
తొలిజాము ఉదయాతపూర్వమే మలివి డతగా
కష్టనష్టాలను కలబోసుకుని సేద దేరేవారు ...
వెళ్ళొస్తామంటే ... వెంటనడిచేవారు
మైళ్ళదూరం ...జాగ్రత్తలు చెబుతూ...
చేరుకున్న యోగక్షేమాలను ..కబురు
పెట్టమని తిరుగు టపాలో ... కాకితోనో...
కలం కాగితంల కలబోతలతోనో ...
సాంకేతికత సందు దూరాక ...
స్మార్ట్ ఫోన్లు చెంత చేరాక ...
అతిథులేంటి ...ఖర్మ ... ఇంటి వారే...
పరాయివాళ్లయి ... పలకరింపులన్నీ
చిలకరింపులై ... మానవ సంబంధాల
మనుగడే చికాకుల చిరునామై...
ప్రశ్నార్థకాల కూడలిలో పలకరిస్తుంది ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment