Friday, December 2, 2022

గుండె చప్పుడు తేదీ : 16-08-2022 శీర్షిక : ప్రకృతమ్మ ఒడి

 గుండె చప్పుడు 

తేదీ : 16-08-2022 
శీర్షిక : ప్రకృతమ్మ ఒడి 
కవిత సంఖ్య : 961

పరికించి పరవశించగలిగే మనసుకు 
ప్రకృతి నిండా ప్రతీ క్షణం వినిపించే 
వీనుల విందయే శబ్దం.... 
నయన మనోహరమయే తొలి సంధ్యల 
భూపాళం .... 

ఉదయాత్పూర్వపు పక్షుల కిల కిలలు... 
పచ్చని శోభలనద్దుకున్న తరువుల పైరగాలి .... 
ప్రశాంతమైన వనములో గలగల సాగిపోయే 
సెలయేటి ఝరులు .....

సాయం మలి సంధ్యల సరాగాలు .... 
పరవశాల గూటికి చేరుకుంటున్న  
పక్షుల రవములు ....పక్కన్నే పలకరించే  
లయబద్దమైన కీచురాళ్ళు నిశ్శబ్దభేరి .... 
 
నిండు పున్నమి శోభల పండు వెన్నెలలో 
నియమ నిష్ఠల కదిలే కడలి కెరటం ..... 
ప్రశాంత నిష్కల్మషాల పచ్చని వాతావరణ శ్వాసలు...  
వినసొంపైన పశుసంపదల అంబారవములు... 

కనగలిగిన కావ్య దృశ్య మాలికలు 
వినగలిగిన ఇంపైన రాగశబ్ద భావనలు ... 
ముందు ముందు మురిపంగా పొత్తములో తప్ప 
మచ్చుకైనా కనలేని ప్రకృతి గుండె చప్పుడు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment