జీవన పోరాటం
తేది : 17-08-2022
శీర్షిక : నిత్యపోరాటం ....
కవిత సంఖ్య : 962
కలికాలపు కాలుష్యపు కోరల
కష్టాల కొలిమిని దాటుకుని...
కన్నతల్లి కడుపులో ఫలదీకరించుకుని
కాయై నిలవడమే తొలి పోరాటం ...
అమ్మ గర్భకుహారంలో కనలేని కళ్ళతో
ఉమ్మనీటిలో కబోదిలా ఈదులాడుతూ
స్వంత మలమూత్రాలలోనే తచ్చాడుతూ
తొమ్మిది నెలల కాలం తోడయే పోరాటం ...
బాలారిష్టాలన్నీ బ్రహ్మాండముగా
గెలుచుకుని... భువిపైన కాలుమోపు
బుజ్జాయిగా .... బుద్బుదజీవితానా
బుద్దిని గెలిపించ నిత్య యోధుడై ....
కోటివిద్యలు కూటికై వెలువడంగ
విజ్ఞాన సముపార్జనల వివిధ దశల
పగలు రేయిలు మరిచి పాకులాడు
సమయస్ఫూర్తుల సాధించ నిత్య భృతి ....
నమ్ముకున్నవాళ్లను నట్టేట ముంచక
నావ నిత్యం నిరాటంకమై నడిపించాలన్నా...
కాయ కష్టాలను నమ్ముకునే కర్మ సాధనలో
ధర్మ పోరాటాం చేయాల్సిందే ....
కపటత్వాలతో కాలం వెళ్లదీయాలన్నా
స్వార్థాలతో సలసల కాగాలన్నా ....
బంధుప్రీతితో చెట్టాపట్టాలేసుకోవాలన్నా ...
మానవత్వం వదిలేసిన దానవత్వంతో
మసులుకోవాలన్నా ... పాప భీతుల
ప్రాయశ్చిత్తాలకు నిత్యపోరాటం చేయాల్సిందే ...
సంఖ్యకు ... సలహాలకే పరిమితమైనా
సందర్భోచిత చలనశీలత్వంతో
జీవనగతుల చరమాంకంలో కూడా
ముక్తినాశించి భక్తి భావనల పునీతమౌతూ
అనాయాస ముగింపు వాక్య పూరణాలకై
జరపాల్సిందే మన ఆఖరి పోరాటం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment