Thursday, December 1, 2022

వరలక్ష్మి వ్రతం తేది : 05-08-2022 శీర్షిక : అపర్ణాదేవి పండగ

 వరలక్ష్మి వ్రతం

తేది : 05-08-2022
శీర్షిక : అపర్ణాదేవి పండగ 
కవిత సంఖ్య : 954

శ్రావణమాసం వచ్చేసింది 
సకల శుభాలను కలుగజేయ 
సందల్లెన్నో తెచ్చేసింది 
సర్వాంతర్యామి అమ్మ రూపమైన 
అపర్ణాదేవి పండగ...ఆడ పడుచులకు ... 

ఇంటిల్లి పాది కొరకు ఇంపైన 
క్షేమాలు కోరుతూ...ఇంతి చేసే పూజలు ... 
అష్టలక్ష్ములలో అద్వితీయమైన 
వరలక్ష్మి మాతను వరసై కొలవంగా ... 

పక్షుల కిలకిలా రవముల పలకరింపులతో
తెల తెల్లవారక ముందే తరుణీమణులంతా 
శుచి శుభ్రతల రంగవల్లులు తీర్చి దిద్దేరు ...  
ఆధ్యాత్మికతలకు పెద్దపీట వేస్తూ .... 

గడపలన్నీ  గంభీరంగా అలంకరించి
పసుపుకుంకుమలతో...  పచ్చపచ్చని 
మామిడాకుల  తోరణాలతో పూల మాలలతో 
పుణ్యవతి శ్రీమహాలక్ష్మికి ఆహ్వానమంపంగా .... 

తలంటు స్నానాల తనివి దీర చేసి 
పట్టు వస్త్రములను నిష్టగా ధరించి 
పారాణి పాదముల పసుపు రాసుకుని 
మేలైన ఆభరణములన్ని మెండుగాను ...  

అమ్మవారికి సైతం అనువైన రీతిన 
నూతన వస్త్రాలు...పరిమళాల పూలు 
ఆభరణాలతో అలంకరింపజేసి ... 
దండి దీపారాధనలతో ... అందమైన 
కలశమును సుందరముగా  తీర్చి 
దిద్ది ... దూప దీప నైవేద్యాలర్పించి 
ఆర్తిగా హారతిచ్చి .... అష్టోత్తరాలతో 
అమ్మను పూజించడమే శ్లోకాలతో….

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయ
శ్రీ రంగథామేశ్వరీం|
దాసీభూత సమస్తదేవ వనితాం 
లోకైక దీపాంకురాం |
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః 
బ్రహ్మేంద్ర గంగాధరాం|
త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం
వందేముకుందప్రియాం||

ఇంటికి వచ్చిన వనితలందరికి
ఇంపుగా వాయనాలిచ్చి... వరసగా
వందేండ్ల పిల్లా పాపలతో సుఖసంతోషాల
వర దీవెనలు పొందడమే .....

నగునూరి రాజన్న

No comments:

Post a Comment