Thursday, December 1, 2022

ఒకే గూటి పక్షులు తేది : 26-07-22 శీర్షిక : నేతన్న తానులోని తెల్లముక్కలే ....

 ఒకే గూటి పక్షులు

తేది : 26-07-22
శీర్షిక : నేతన్న తానులోని తెల్లముక్కలే .... 
కవిత సంఖ్య : 946

పౌర సమూహాలకు ప్రతినిధులుగా 
పెద్దన్నపాత్రలో ఉద్దండం తీసుకుని
కష్టాలను ఎదిరించి కడగండ్లను దాటించి 
సమస్యలను రాకుండా చూడండయాంటే ... 

హాలికుని పొలంలో అరక దున్నినా 
సైనికుని హద్దులో పహారా కాయకుండానే 
శ్రామికుని చేతిలో తట్ట పార పట్టుకున్నా 
పారిశుద్ధపు పనితనాన్ని పట్టించుకోకుండానే ... 
చిత్రాలు దిగుతారు.... చిత్రంగా పూటకో 
వేషం కట్టి చిటారు కొమ్మల్లో ఊరేగిస్తారు ... 
 
ఊరునిండా కలుషితాల జండాలు పాతి 
మతం రంగులు పూసి మాయలు చేస్తూ
కళ్ళు చెదిరే కటౌట్ల సుందరీకరణలతో   
కులాల పిచ్చి లేపుకుంటూ కూలదోస్తూ... 

ఎన్నికలహామీలతో ఎసరు పెట్టి 
ఓట్లపండగలకు నోట్లకట్టలు ఎర వేసి 
మైకుల్లో మాటలతో మురిపిస్తూ..మైమరిపిస్తూనే 
సంక్షేమ పథకాలన్నీ సక్కంగా వండేసి...ఉత్తుత్తి 
వడ్డింపుల చక్కిలిగింతలు పెడుతున్నారు .... 
 
ఎన్నికల జాతరలో  పోట్లగిత్తల్లా 
ఎగబడి కొట్లాడి...జబర్దస్తీగా పోటీపడి  
పొల్లుపోని సొల్లుకబుర్లెన్నో పూసగుచ్చి 
చెవుల్లో రొదపెట్టి చెప్పి నిలుస్తారు .... 

కలిసి మెలిసిన బతుకులలో కడివెడు విషం 
విరజిమ్ముతూ...ఓడేళ్ళేదాకా ఓడమల్లప్పల్లా ....
ఓడ దిగినాక బోడమల్లప్పలా ...తామంతా ఒకటిగానే 
చీకటి ఒప్పందాలతో తెల్లవారదీస్తారు ..... 

సుందరమైన ఇంద్రధనస్సులోన
చుట్టుకున్న సప్తవర్ణాల కూటమిలా 
పార్టీలు వేరైనా పద్ధతులన్నీ ఒకటేలా  
ధవళవస్త్రదారులంతా వేర్వేరు కండువాలతో .... 

పాలించే పంచరంగుల అధికార పక్షం 
ప్రశ్నించే వెలిసిపోయిన ప్రతిపక్షం
అన్నీ ఆ నేతన్న తానులోని తెల్ల ముక్కలే 
కాలం అనే ముసుగులో...  కారు చీకటిలో 
అన్నీ ఒకే  రూపం ... అన్నీ ఒకే వర్ణం .... 
వారు వీరికి సహకరిస్తూ .... వీరు వారికి 
సహకరించుకుంటూ ... అంతా నలుపే ... 
అభివృద్ధి శూన్యం ... అప్పులు సశేషం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment