కలల కలిమి
తేది : 26-09-2022
శీర్షిక : కలల ప్రపంచం ...
కవిత సంఖ్య : 995
ప్రాణకోటిలోనే ప్రాశస్త్యం
పరమపావనమైన మానవ జన్మం...
నిత్యాన్వేషిగా సాగిపోతూ
నిరంతర మేధోమధన తపోశాలి ....
భానుడు పశ్చిమాన వాలిపోగానే ....
వెలుగుల పరదాలను నిశీధి ఆవరించి
తుంటరి రెప్పల తలుపులు భారంగా
బరువుగా ముకుళితమై నిద్రకుపక్రమించ ....
మెలకువ జీవన బృందావనంలో
నవరసాలతో నగారా మోగించిన
నిత్యకృత్యముల నీడల ఛాయలే
మేధో మధన మనన మర్మాలు ...
మనసు తెరల తోటలలో నిక్షిప్తమైన
సున్నిత సుమనోహర కుసుమ కోమలాలు
సప్త వర్ణాలు సంతరించుకుని
నిద్రలో అద్దమై ప్రతిబింబించే
సుందర దృశ్యాలే కలలరూపం ...
ఖర్చుల పద్దులు రాయక్కరలేదు
కాలం ఖర్చులు చేయక్కరలేదు
కంటి పైన రెప్పలు వాల్చితే చాలు
కమ్మని కలల ప్రపంచాన్ని
ఘనంగా నిర్మించుకోవచ్చు ....
కొన్ని జ్ఞాపకాల సంచిలోకి రావు
మరి కొన్ని వాడిపోతుంటాయి
కొన్ని మాత్రమే ఆచరణాత్మకమై
అందలాలను అనుగ్రహిస్తాయి ....
ఆశలైనా...ఆలోచనలైనా..ఆశయాలైనా . ..
కలలైనా ...ఇలలో ఆచరణాలైనా ...
అమ్మ ప్రేమలా అమృతమయమై
మానవత్వపు సుగంధాలు పులుముకుంటేనే ...
ఆత్మీయతల పూదోటలై అల్లుకుంటేనే
అవని రక్షణలకు అచ్చమైన కంచెగా ...
జీవరాశికి...మానవాళికి...మేలి మలుపుగ
ఉంటేనే .. అందం.. ఆనందం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment