Friday, December 2, 2022

దారి తప్పిన సంతోషాలు తేది : 07-09-2022 శీర్షిక : ఎక్కడని వెదికేది ?

 దారి తప్పిన సంతోషాలు 

తేది  : 07-09-2022
శీర్షిక : ఎక్కడని వెదికేది ? 
కవిత సంఖ్య : 980

పచ్చ పచ్చని పల్లెతల్లి ఒడిలో 
పైరగాలి స్పర్శలతో...సెలయేటి 
గలగలలలో పెరిగిన మనిషి నాడు 
బందంలేని బంధుత్వాలకు  
ఆత్మీయతలకు చిరునామా.... 

ఉరుకులు పరుగుల ఉప్పెనలో 
బతుకు బండి అంత తిప్పలమయం 
నాగరికతల నడకల నుండి 
పారిశ్రామిక పరుగులు లంఘించాక ... 

బతుకు దెరువు బాటలలో  
దారులన్నీ పట్టణాలవైపయ్యాక 
అవిభాజ్యాల ఆత్మీయతలు తగ్గి 
చిన్న కుటుంబం చింతలమయం .... 

పెద్దవారి సుద్దుల తోడు కరువై 
క్రమశిక్షణలు ఎండమావులై గతి తప్పి 
స్వీయనియంత్రణలు నీతి తప్పిన  
బందాలన్నీ ఆర్థికాంశాలమయమే  .... 

కల్తీల శాల్తీల వల్లనో 
కాలుష్యాల కాసారాల వల్లనో 
శాంత మూర్తుల స్వభావాలన్నీ 
చిర్రుబుర్రుల సీతయ్యలే ..... 

మనిషి యాంత్రికమైపోయి 
పక్కవారిని కూడా పట్టించుకోలేనంత  
మనసు నిస్తేజమై ... స్పందనల  
ప్రతిస్పందనల పరాకులు .... 

సాంకేతికతలు చంకలో దూరి  
చరవాణి చక్రం తిప్పుతుంటే 
మాటా మంతీ... మంచీ చెడూ 
పలకరింపులు లేని కొనుగోళ్లు 
అమ్మకాలే ... 

ఇప్పుడు పక్కవారిని కాదుకదా ... 
స్వంత వారిని కూడా ... సాంతంగా 
పలుకరింపుల చిలకరింపులే ... 
పరధ్యాన్నపు ముభావాలే .... 

ఇవన్నీ చాలవన్నట్టు .... 
పనికట్టుకుని ప్రభుత్వాలే 
ప్ర సా దు లను  నడిపిస్తూ 
ప్రజలను దారి తప్పిస్తుంటే ... 
సంతోషాలను ఎక్కడని వెదికేది ?

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment