Friday, December 2, 2022

చినుకుల సవ్వడి తేది : 18-08-2022 శీర్షిక : బతుకునిచ్చు ...

 చినుకుల సవ్వడి 

తేది : 18-08-2022
శీర్షిక : బతుకునిచ్చు ... 
కవిత సంఖ్య : 963

భయానక చిత్రంలో భళ్ళుమన్న 
విట్టలాచార్య వీరంగంలా రంకెలేసే మేఘం .... 
వేల విద్యుల్లతలు ఒక్కటై పిక్కటిల్లిన 
కాంతి మెరుపుల కమనీయ వెలుగులు    ..... 

అల్లంత దూరాన అరవిరిసిన 
కుసుమాలై ఆరబోసుకుంటున్న
చినుకులకు...ధూళిగా లేచి గాలిలో 
పయనించి గమ్మత్తుగా ఆవరించిన 
మట్టి సువాసనలు…ఇట్టే పట్టేసిన 
నాసికములకు ఇంపైన విందే కద .... 

చినుకుల పరదాలు తొలగకముందే 
నీలాకాశంలో మెరిసిన హరివిల్లు…
చిన్నా పెద్దల దరహాసాలలో
కుమ్మరించు రాతనాల రాసులు ..... 

చినుకు చినుకు పలకరించగ  
పులకరించి మురిసిన అవని తనువు
పచ్చందాలను ఆరబోసుకుని 
తరువులను మురిపించి మరకతమై శోభించు... 

గలగల నాదముల సెలయేళ్ళన్నీ 
గమకాలతో గర్వంగా  పయనించవా  
ఋతువులన్నీ గతులు మార్చుకుని 
బతుకులకు బాసటై నిలవవా ..... 

హాలికుడు శ్రామికుడు అంగరంగ 
వైభవంగా అరక దున్ని మెరకలన్నీ 
చదును చేసి మెతుకునిచ్చే అన్నపూర్ణను 
ఆదరంగా మనోపూజితమై ఆహ్వానించు… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment