మాతృ గీతాలు
తేదీ : 07-05-2022
శీర్షిక : పరంధాముడే పరవశించే ....
కవిత సంఖ్య :
అమ్మంటే అణువణువు నువ్వేనని
అమ్మంటే నీఆత్మేనని నమ్ము సోదరా .... //2//
అమ్మంటే దేవుడికి ప్రతిరూపం
అమ్మంటే నీ ఉనికికి నిజరూపం
అందరిని ఆదరించ దేవుడే అమ్మాయే
పరంధాముడే అమ్మై పరవశించిపోయే ..
//అమ్మంటే//
పున్నామ నరకం తాను జయించానని
పురుడు పోసుకోగానే సంబరపడుతుంది
కండరాల పొత్తిళ్ళలో కనుపాపగా చేసేసి
కడుపులోన నిలుపు తాను తొమ్మిది నెలలూ ...
అమ్మంటే అణువణువు నువ్వేనని
అమ్మంటే నీఆత్మేనని నమ్ము సోదరా
కానుపంటే మరో జన్మమెత్తడమే
కాదని వెరవదూ అమ్మతానెప్పుడూ
బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో ఇస్తుంది
బుల్లిబుల్లి మాటలకే తాను మురిసిపోతూ…
//అమ్మంటే//
తల్లి తేలు పొట్ట చీల్చు కొనునురా
పసి పిల్లలకు తాను జన్మమీయంగా …
పదిమందినైనా కడుపుకట్టి సాకునురా
పస్తులుండైనా తాను పరవశించునురా ....
అమ్మంటే అణువణువు నువ్వేనని
అమ్మంటే నీఆత్మేనని నమ్ము సోదరా
అమ్మంటే నీ గుండెకు చెమ్మరా
అమ్మంటే అన్ని గుడుల శిఖరంరా….
బాల్యంలో మనమంతా అలిగెదమూ
అమ్మ నాదంటే నాదని పోరెదమూ....
//అమ్మంటే//
అమ్మంటే అక్షరాలే అనుకోకురా ....
"అ"నుక్షణం "మ"రువకూడని మంత్రంరా
అమ్మ ప్రేమకు దైవమే పరవశించె కదరా
ఆపరంధాముడే అవతరించి కృష్ణుడాయెరా…
అమ్మంటే అణువణువు నువ్వేనని
అమ్మంటే నీఆత్మేనని నమ్ము సోదరా
విసుగుతో తిట్టినా వింతగ దీవెనలౌరా
కోపంతో కొట్టినా సదా కోరు…క్షేమంరా
అవసానంలో నువ్వు ఆదరించరా
అర్చరాది మార్గాన జగద్విదిత సత్యంరా ....
//అమ్మంటే//
No comments:
Post a Comment