చిత్ర కవిత
తేది : 11-09-2022
శీర్షిక : ఎదురు చూపులు
కవిత సంఖ్య 984:
రెక్కలు ముక్కలు చేసుకుని
కాయ కష్టంతో కలో .. గంజో ..
తాగి గౌరవంగా బతుకాలనుకునే
ఆత్మ నిర్భరతల శ్రమజీవులు…
తట్ట పార పట్టుకుంటే చాలు
పొట్ట నింపుకోవచ్చునన్న గుండెధైర్యం
ఒంట్లో సత్తువుంటే చాలు
రేపటి గింజలకు ఢోకా లేదన్న నమ్మకం….
నిశి చీకట్లను పారద్రోలుతూ
కట్టుబాటుగా వచ్చే దినకరునిలా
దేశ ఆర్థిక పురోభివృద్ధికి క్రమశిక్షణగా
పాటుపడే మూల స్తంభాలు ...
విరించికన్నా సుందర మనోహరంగా
విశ్వపు అందాలను ఎప్పటికప్పుడు
తీర్చిదిద్దుతూ గొప్ప విలువలద్దుతున్న
మొక్కవోని దీక్షా దక్షులు... నిత్య కృషీవలురు….
జానెడు ఇంట్లో మూరెడు కట్టెలా
అలవి కాని కోరికలన్నీ అటకెక్కించి...
సద్దిమూటలు సర్దుకుని తాత్కాలికంగా
తనను తాను తాకట్టు పెట్టుకునేందుకు
నిరీక్షించే నిరక్షరాస్యతల నిట్టూర్పులు...
వింతగా విశ్వమంతా వినిపించేలా
వజ్రోత్సవ సంబరాలను జరుపుకున్నాం ...కానీ
ఊరూరా వాడ వాడలా ఎదురుచూపుల
అడ్డ కూలీలను ఉద్దరించలేకపోయాము...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment