అవకాశవాదం
తేది : 24-08-2022
శీర్షిక : రాజకీయ హక్కుభుక్తాలు
కవిత సంఖ్య : 968
ఆలోచనల జీవనదులతో
భావప్రకటనల మాటా మంతితో
భాషాపరిజ్ఞానాల ప్రజ్ఞతలు కలిగి
అంచెలంచెలుగా ఎదుగుతూ...
పంచెలకై కట్టుబట్టలు కనుక్కుని
ఒంటిని సంరక్షించుకోగలిగి
అవసరాలు తీర్చుకుంటూ ..
మంచి చెడుల విచక్షణలతో
మనగలిగే సామర్థ్యాల జీవి ...
జీవరాశిలో మిన్నని చాటుకునే
మనిషిలో కూడా మరో మనిషి
దాగి..స్వార్ధపు సంచుల సంకెళ్లతో
రంగులు మార్చుకునే ఊసరవెల్లిలా
ఆడంబరాల రంగుల కలలను కంటూ ...
అప్పుడప్పుడు అవకాశ వాదాన్ని
ఆసరాగచేసుకుని అంటకాగి
అవసరాలు తీర్చుకుని ఆనక
అసలేం తెలియదన్న నటనలతో
నాటకాలను రక్తి కట్టిస్తుంటారు ....
సాధారణ మనుషులు అప్పుడప్పుడు
ఆపద్ధర్మంగా అమలు చేసినా ...
రాజకీయ నాయకులు మాత్రం
కులగోత్రాలలా ఇంటిపేర్లలా
వంటిమీద పచ్చబొట్టుగా పొడిపించి
స్వంతం చేసుకుని హక్కుభుక్తాలకై
అర్జీలు పెట్టుకుని ... అర్చనలతో
అభిషేకాలతో అవకాశవాదాన్ని
అమాంతంగా ఆకాశానికి
ఎత్తుకుంటున్నారు.....
నిజానికి ....
మనిషన్నవాడు మానవతలకు
మచ్చుతునకలై...మంచితనాలకు
చిరునామాలై...ఆత్మీయత అనురాగాల
పరిమళ సుగంధాలను పంచాలి ...
తరువులా సేవలందించాలి .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment