అంశం : తెల్లవారితే
తేది : 15-08-2022
చీకటి తెరలు చీల్చుకొని
సుమాల వందనాన్ని
హుందాగా స్వీకరిస్తూ...
తూర్పు వాకిట నిల్చున్న సూర్యుడు,
మెడలో మువ్వలతో
ఛెంగున గంతులతో
ఆవు చేంతకు చేరే
కట్టు విప్పిన తువ్వాయిలూ
కోనేటిలో కలువలపై
తుమ్మెదల ఝంకారాలూ
గర్భగుడిలో పూజారుల ఓంకారాలూ
మైకులో ఎమ్ఎస్ సుప్రభాతాలూ
తెల్లవారకముందే
విజ్ఞానం నీ ముంగిట్లో అన్నట్టుగా
సైకిలు గంట మ్రోగిస్తూ...
వార్తా పత్రికల కుర్రాళ్ళు
భరతమాత బరువు భాధ్యతలు
ఇకపై మావే అన్నట్టుగా
భుజాన కేజీల బరువుతో
ముందుకు సాగుతున్న ఎల్ కే జీలు
ఇంకా!
కూరల సైకిళ్ళు, పాలకావిళ్ళు
కాలేజీల్లో 'సెట్ల' పరీక్షలు
పిన్నిగారితో టీవి ముచ్చట్లు
దగా పడ్డ గాధలు
దిగాలు పడ్డ వ్యధలు
సంసారుల వెతలు
సాధించిన ఘనతలు
ఎన్నిసార్లు తెల్లవారినా
ఈ దృశ్యాలు నిత్యకృత్యాలు
అంత్రంగా తెరచిన కళ్ళకు
రమణీయ నేస్తాలు
అందుకే:
నిన్నటి పొరబాటును
రేపటి దిద్దబాటుగా మార్చుకుందుకు,
సంధిగా నిలిచే ప్రతి సూర్యోదయం
సాకారం చేసుకొనే కలలకు
శ్రీకారం చుట్టే శుభోదయం
No comments:
Post a Comment