Sunday, December 4, 2022

చిత్ర కవిత తేది : 22-09-22 శీర్షిక : మంచి మార్పు

 చిత్ర కవిత 

తేది : 22-09-22
శీర్షిక : మంచి మార్పు
కవిత సంఖ్య :   158+8

నేటి బాలలే రేపటి పౌరులంటూ 
అనర్గళమైన ఊసుపోక  కబుర్లకు...   
ధవళవస్త్రదారులంతా దద్దరిల్లే 
ఉపన్యాసాలకు మంచి విషయమే .... 

ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారతం 
పిల్లల పోషణలకై దేబిరింపులే దూరదర్శన్ లో
బాలకార్మికులకైతే లెక్కేలేదు…లెక్కతేలదు..
దిక్కున్న చోట చెప్పుకున్నా దిక్కవ్వరు ... 

ప్రపంచ మహాసభలలో కూడా నాయకుల 
చిలుక పలుకులే ... కోట్ల కొద్దీ అప్పులు 
రుణాలు సబ్సిడీలు ... చేతులు మారతాయి 
కానీ అసలు గమ్యం చేరుకోవు ..... విశ్వమంతా
ఇదే తంతూ ….

గరీబీ హటావో అంటూ ఏబదేండ్ల  కాలం .... 
ప్రధానమంత్రులనేకంగా మారిపోయారు 
నినాదాలు మాత్రం నిలిచిపోయాయి 
చరిత్రలో ....అంగుళం కదలకుండా .... 

పాలక ప్రాపక రౌడీ మూకల సమాంతర 
పాలన ప్రవాహాలలో ...మాయమౌతున్న
ఆడవారు పాసిపాపాలు... 
కొంతమంది నలుపు దరహాసాల నాయకులు 
అనేకమంది ఆమ్యామ్యాల అధికారగణం…
కపట చంచల స్వచ్చంద సంస్థలు 
కడు అమాయక చక్రవర్తులైన ప్రజలు  
మారనంత వరకు సమస్యల జోలెలు 
పెరుగుతూనే ఉంటాయి ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment