Friday, December 2, 2022

అనురాగ జలధి తేది : 06-09-2022 శీర్షిక : అమృతమూర్తి అమ్మ

 అనురాగ జలధి

తేది : 06-09-2022
శీర్షిక : అమృతమూర్తి అమ్మ 
కవిత సంఖ్య : 979

నలుసై కడుపులో పడిన 
క్షణం మొదలు...వికారాలను 
అధిగమిస్తూ  వింతగా  కారం 
మెతుకుల కాలం వెళ్లదీస్తుంది .... 

కానుపంటేనే మరో జన్మ 
అయినా వెరవదు అమ్మ 
కళ్ళల్లో వత్తులేసుకుని 
కదలికలకు మురిసిపోతుంది ... 

అష్టకష్టాలు అధిగమించగానే  
ఆనందాల మునిగితేలుతుంది ... 
పత్యాలన్నీ చేసుకుంటూ 
కంటికి రెప్పలా ప్రతీ క్షణం కాపాడుతుంది ... 

మాటల్లో మాట కలుపుతూ 
చేతల్లో చేయి అందిస్తూ 
అడుగుల్లో అడుగులు వేయిస్తూ 
అడుగడుగున ఆలంబన అవుతుంది ... 

ఎదుగుతున్న పిల్లల చూసి 
ఎగిరి గంతేస్తుంది అమ్మతనం 
నలుగురి నోట ముచ్చట విని 
మురిసిపోతుంది అమ్మతనం ... 

నదీమతల్లి నడకలా...  
పిల్లలు వెనుతిరిగి చూడకున్నా .... 
అమ్మ ప్రేమలో ఆవగింజంత 
మార్పు కూడా పొడసూపదు  .... 

అందుకే అవనిలో అమ్మను 
మించిన అమృతమూర్తి లేదు .... 
అనురాగ జలధంటూ 
వేరే ఏదీ ఉండదు .... 
  
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment