Friday, December 2, 2022

అనంతం తేది : 26-08-2022 శీర్షిక : విజ్ఞాన వీచిక

 అనంతం 

తేది : 26-08-2022
శీర్షిక : విజ్ఞాన వీచిక 
కవిత సంఖ్య : 970

బాల్యం దులుపుకుని బాధ్యతగా 
అక్షరజ్ఞానాల అంగవస్త్రాలు ధరించి 
క్రమశిక్షణగా అడుగులు కదిపాక  
అవనిలో తిరుగాడు అలుపెరుగని 
బాటసారులమే ... 
సంద్రంలో సేదదీరలేని అలలమే... 
గగనంలో గమ్యందొరకని వ్యోమగాములమే...
ఏదీ పూర్తిగా దక్కని చెక్క ముక్కలమే .... 

కాలం పేర్చిన చరిత్రలయినా ... 
కలం కదిపిన వివిధ విజ్ఞానాలయినా ... 
పరిసరాలు పదిలపరుస్తున్న 
విషయ పరిజ్ఞానాలయినా ... 
ఓ పట్టాన ఒడువని మచ్చట్లే ... 

అన్నపూర్ణగా ఆదరిస్తున్న 
భూగోళం గురించిన ఊసులైనా .... 
పుట్టుక నుండి నేటివరకు  
పుణికిపుచ్చుకున్న అనేక 
విభాగాల వింతలు విడ్డూరాలయినా ...  
విశ్వజీవరాశి ఘన వివరాలయినా ... 

చీకటి వెలుగులను చిత్రీకరిస్తూ  
మిలమిలల నక్షత్రాలతో 
చిన్నా పెద్దలను ఆనందాలలో ముంచి   
అలరిస్తూ...  అందుకోమ్మంటూనే ..
అందకుండా... దాగుడుమూతలతో ...  
మనిషికి నిత్యం చిక్కుముడిలా చిక్కకుండా 
భ్రాంతిలో ముంచుతూ బోల్తా కొట్టిస్తున్న 
అండపిండ బ్రహ్మాండపు అనంత శూన్యమైనా  ..... 

నక్షత్ర మండలాలను పొదువుకుని 
ఒక్కొక్క పాలపుంతలో వయ్యారంగా 
గ్రహాల ఉపగ్రహాల సమూహాలతో 
తారా చంద్ర సూర్య సమాహారామై 
అనేక అందాలకు ఆలవాలపు అనంత 
విశ్వమైనా ...

నిద్రాహారాలు మానుకుని నిరంతరం 
నిగ్గదీసుకుని నిఖారసుగా చదివినా ... 
జీవిత పర్యంతం మనం నిత్యవిద్యార్థులమే ..
అనంతమైన విజ్ఞాన వీచిక ముందు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment