Sunday, December 4, 2022

తెరలవాణి తేది : 12-09-2022 చరవాణి

 తెరలవాణి 

తేది : 12-09-2022
కవిత సంఖ్య : 167+5

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

లాండుఫోను వచ్చింది 
మంచి చెడులు తెలిపింది 
కొత్తల్లో ఆనందం 
కొసిరి కొసిరి ఇచ్చింది 

కాలాలు గడవంగనే 
వేళా పాలా మరిచింది 
సుట్టుమొట్టు ఇండ్లోల్లకు 
పొట్టు పొట్టుగ వస్తుంటే ... 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

పేజర్లు వచ్చినయి 
యూజర్లు పెరిగారు 
అడ్డగోలు ధరలతో 
నడ్డివిరిచి నాట్యమాడే... 

చరవాణి  బైలెల్లె
స్థిరమేమో లేదాయె  
కాల్ చేస్తే చార్జీలు 
కాల్ వస్తే చార్జీలే .... 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

లొకేషన్లు చూపించే 
లొసుగులన్నీ తెలిసిపోయే  
చిన్న చితక తప్పులకు 
తిప్పాలాయే బతుకులకు 

రకరకాల కారియర్లు 
రంజైన ప్రకటనలు 
గజిబిజిగా ఆఫర్లు 
గల్లంతు సిగ్నళ్లు 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

ఒక్క సిమ్ కాకుండా 
రెండేసి సిమ్ములకు 
సౌలతేమో పెరిగింది 
సౌఖ్యమేమో తగ్గింది ... 

కోట్లకొద్దీ ఆదాయం 
కోటరీల వ్యాపారులకు 
నియతి లేని ప్రభుతలు 
నియంత్రణ గాలికొదిలే 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

తెరలవాణి వచ్చింది 
తెల్లవార్లు పలికింది
ఆప్ లెన్నో వచ్చాయి 
వీపులేమో మోతాయే ... 
 
సహచరిలా అంటిపెట్టు 
వైఫైలే  కాకుండా 
డాటాలతో తంటాలు 
మోతమోగే చార్జీలు 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

ఇల్లు కదిలే పనిలేదు 
ఆన్లైన్లో షాపింగులు 
కాలు కదపకుండానే 
కంచంలకు ముద్దవచ్చే ... 

కరోనా పుణ్యములో 
లాకుడౌన్ లంగరులో
వర్క్ ఫ్రమ్  హోములు 
గూగుల్ మీట్ తరగతులు 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

ఆడ మగ చేతులలో  
అడ్డాల బిడ్డలాయే 
అనుబందపు ముచ్చట్లు 
అటకెక్కి వెక్కిరించే .... 

ఇంటోల్లే పరాయలై 
పలకరింపు ముభావాలు 
ఆత్మీయతలు కరువై 
చిలకరింపు బంధాలు .... 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment