Sunday, December 4, 2022

జీవన సాఫల్యం తేది : 20-09-2022 శీర్షిక : చల్లని హిమశిఖరం

 జీవన సాఫల్యం

తేది : 20-09-2022
శీర్షిక : చల్లని హిమశిఖరం 
కవిత సంఖ్య : 990

లక్షల  జీవరాసులలో 
లక్షణంగా  కాచి వడబోసుకుని 
తులనాత్మక లెక్కలేసుకుంటే 
ఉత్తమోత్తం మానవ జన్మం ... 

మానవత్వాల మల్లె పరిమళం 
ఆత్మీయతల ధవన సుగంధం 
అనుభవిస్తే ... అంతా మనం…
ఆచరిస్తే....చల్లని హిమశిఖరం...

ఉన్నంతలో ఉన్నతంగా 
ఉదాత్తంగా మసులుకోవడమే 
మహానుభావుల అడుగుజాడలలో 
మహనీయతలకు పట్టం కడుతూ .... 
మహిమాన్వితంగా మలుచుకోవడమే ... 

నలుగురితో నారాయణలా 
కాకుండా.... నలుగురిలో 
నవనీతమై బతక గలగడమే... 
అనుక్షణం ఆస్వాదించడమే... 

మొక్కుబడి చేతల్లా కాకుండా 
తనువు మనసులు లఘ్నమై 
తలపులన్నీ తక్షణ కర్తవంపై 
శ్రద్దాసక్తులు కనబర్చిన శబరిలా... 

యాంత్రికతలు నిండిన నియంత్రణలు 
కాకుండా ..ఆత్మలు నిండిన ఆదరణలతో 
రంగనాథునికి సమర్పించుకున్న కుసుమ 
తపనల తాపత్రయాల విష్ణుచిత్తునిలా... 

వేష భాషల డాంబికములు కాదు 
లీనమై ...లీలామానుషము గుర్తెరిగి 
జగన్నాటక సూత్రధారి కనుసన్నల్లో 
భక్తి నివేదనల కన్నప్పలా .... 

గమకం తెలిసిన సంగీతంలా 
గమ్యం తెలుసుకున్న గమనంతో  
గుర్తెరిగిన గురుతరముగ 
కదిలి సాగడమే కమనీయం .... 

పనేదయినా పరమ పూజ్యం 
శ్రద్దాసక్తుల మనో ఖడ్గం 
నిండు మనసున సంకల్పం 
దాసోహమే సర్వోత్క్రుష్టం .... 

సాదాసీదాలే సర్వోన్నత శిఖరం 
సవాలక్షమందికి సానుకూల స్థానం....
ఉన్నప్పుడు నెత్తికెత్తుకునే గౌరవం...   
పోయినా....గొప్పవారయ్యే చిరంజీవత్వం  .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment