సంవేదన
తేదీ : 08-08-2022
శీర్షిక : అవని మాతనురా ...
కవిత సంఖ్య :
చెట్టు గుట్ట పుట్టలు నెత్తిన పెట్టుకుని
చల్లని సెలయేళ్ళకు నెలవైనా ...
ప్రాణ కోటిని అక్కున చేర్చుకుని
పరమానందం పొందే అవని మాతనురా...
ప్రాణాలను నిలిపే ప్రాణవాయువులను
పంచే పచ్చని తరువులకు ఆదరువునై ....
జీవరాశి ఆకలి దప్పులు నిరంతరం తీర్చంగా
అమ్మను పోలిన అవని మాతనురా .....
రాయి రప్పల్లో రత్నాలను నింపుకుని
పైనా...లోపల గర్భకుహారంలో పలురకాల
విలువైన సంపదలను పొదువుకున్నా
ఇంధనాలను ఇంపుగా నింపుకున్నా
అష్టలక్ష్ముల అంశగా నిలిచి మిమ్మల్ని
శ్రీమంతుల చేసే అవని మాతానురా ....
ఎప్పటికప్పుడు జీవరాశుల నిత్యావసరాలను
నిర్విగ్నముగా ... మానవాళి అవసరాలకు
అనుగుణంగా... ఆశలకు ఊసులు పోస్తూ...
అత్యాశలకు ఊతమిస్తూ ... అనునిత్యం
అండదండలందిస్తూ
మీ వెంటే నిలిచే
అవని మాతను రా .....
ఒక్కొక్కరు పుట్టినది మొదలు ...
పెరిగి పెద్దయి పుడకల్లో చేర్చేవరకు
కంటికి రెప్పలా కాచుకుంటూ ...
ఇంటికి పైకప్పునైనా...ఒంటికి గుడ్డనయినా...
జిహ్వచాపల్యాలకు రుచులనద్దుతూ.. .
కళ్ళకు సప్తవర్ణాల శోభలను కూర్చుతూ ....
అడుగడుగున బాధ్యతల గంపలు
నెత్తికెత్తుకుంటున్న...తండ్రి లాంటి అవని మతానురా ...
ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన జనాభాకు
ఇగురంతో ఇన్ని పాత్రలు పోషిస్తున్నా ...
ఎప్పటికప్పుడు .... అలసత్వంగా రంకు
నేర్చినమ్మ బొంకు నేర్చిన చందంగా ...
అమ్మలాంటి నన్ను మోకరిల్లి
కాపాడుతావనుకుంటే ....రోజు రోజుకు
కంపరం పుట్టించే కసాయి కాలుష్యాలను
మోయలేనంత నా ఎద నిండా నింపుతున్న
నీ మూర్ఖత్వాన్ని ఏమనాలి ...
అనాదిగా భరిస్తున్ననా బాధలకు
నివారణ సూత్రాల లేపనాలద్దుతావని
ఒకపక్క ఆశిస్తుంటే .... నీ ఉనికికి నీవే
చరమగీతం పాడుకుంటున్న
నీ దైన్యం మరోపక్క ఎక్కిరిస్తుంటే
నా వేదనా సంవేదనలు ఇంకెవరు
తీర్చుతారు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment