Sunday, December 4, 2022

దిద్దుబాటు తేది : 21-09-2022 శీర్షిక : జ్ఞాన చక్షువులు

 దిద్దుబాటు 

తేది : 21-09-2022
శీర్షిక :  జ్ఞాన చక్షువులు   
కవిత సంఖ్య  : 991 

మగవాడినన్న దురహంకారం 
డాబు దర్పాల బిర్రుతనం 
వెర్రి వేయి విధాలయినట్టు...  
ఇంద్రియలోలత్వంతో తాను 
మెచ్చింది రంభ మునిగింది గంగ 
అనిపించిన క్షణం .... 

అధికార మదం నెత్తికెక్కగానే 
అవతలి వారంతా అల్పులైపోతారు ... 
ఆస్తి అంతస్తుల పొడలో వెధవ 
వేషాలెన్నయినా వేయొచ్చనుకునే తీరు .... 
డబ్బుతో దేన్నయినా ఖరీదు 
కట్టొచ్చనుకునే చౌకబారుతనం .... 

ఒకే ఒక్క క్షణం జ్ఞాన చక్షువులు  
తెరుచుకుంటే ... పశ్చాత్తాపపు 
పరామర్శలో మునిగి తేలితే ... 
స్వీయ మానసాన నాటుకున్న 
తప్పిద భావాల మనన చింతన ... 
మరలించి... మనసు కవాటాలు 
తెరిపించి ... మనిషిగా తనను 
తాను దిద్దుబాటుకు ఉద్యుక్తున్ని 
చేసి ....మానవత్వానికి మచ్చుతునకగా 
నిలపదా..... 

వందేండ్లయినా వంత మారని 
దృశ్యం...నేటి తరం ఎంతోమంది 
నాయకులకు ప్రతిబింబంలా 
గోచరించే సాదృశ్యమైన కావ్యం ...
నాడే సృషించిన గొప్ప ఘనాపాటి... 
మన గురజాడ ...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment