గృహమే కదా స్వర్గసీమ
తేది : 02-09-2022
శీర్షిక : పొదరిల్లు
కవిత సంఖ్య : 976
మట్టిగోడలే కాదు మనసు
పెట్టి వింటే మమతల ఊసులు...
కర్ర తలుపులు కిటికీలే కాదు
కలుపుగోలుతనపు ముచ్చట్లు...
ఆటపాటల బాల్యానికైనా
అమ్మఒడి ఆనందాల కైనా..
నాన్న మందలింపులకైనా
తోబుట్టువుల ఆనందాలకైనా
వెల్లి విరిసే పొదరిల్లు ....
గుడ్డి గుడిసో గూన పెంకులో ...
రంగుల భవంతో ఏదైనా సరే
రందులన్నీ తీర్చుతుంది
రారాజుగా విశ్రమింపచేస్తుంది ..
బాధ్యతల బందీలో మునిగి బుక్కెడు
నూకలకు రోజంతా రెక్కలార్చుకున్నా...
తిన్నావా .. తాగినవా... అనే ఆత్మీయ
పలకరింపులకు కొండెక్కినంత ఆనందమే
ఇంటికొచ్చి సేద దీరితే ....
కలిగినంతలో కలో గంజో
కమ్మని మెతుకులతో కడుపులు
నింపేది ... మనల్ని కనిపెట్టుకునే
ఆమ్మో ... ఆలో... ఎదురుచూసే గుమ్మం ...
దేశమంటే మట్టి కాదు
దేశమంటే మనుషులన్నాడో
మహాకవి ... ఇల్లు కూడా
మమతలు పంచే మనుషుల గడప ...
వేలు పట్టుకుని నడిపించిన
అడుగుల మడి.. మనమీద మనకు
విశ్వాసాలను నింపి విశ్వానికి
పరిచయం చేసిన పచ్చని పందిరి...
నులి వెచ్చని వెలుగుల దీపం...
ఆటల్లో అలిసిన బాల్యానికైనా
జీవితంలో పోరాడే మనిషికైనా
ఇల్లే బలం ...కుటుంబ సభ్యులే
ఆత్మీయతల ఆలంబనం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment