అభ్యుదయ గేయాలు
తేది : 29-07-2022
శీర్షిక : మానవత మరలిరాదా ...
జీవరాశి చరితలో
మానవాళి మిన్నరా
స్వాతంత్య్రం సభలతో
సంబరాలు చేస్తున్నం
వజ్రోత్సవ విజయమని
వరసగ సంవత్సరం....
ఉన్నోడే నాయకుడు
ఉసురులు తీస్తున్నాడు
స్వార్థాలు మాయలేదు
సంకుచితం వదల్లేదు ... // జీవ //
ప్రతినిధుల సభలన్నీ
పరాచికాల కిటకిటలే
పనికిరాని లెక్కలెన్నో
పల్లెదాకా చేరపాయె .....
త్రివర్ణ పతాకాలూ
రెపరెపలు ఆకసాన
తిండి తిప్పళ్లకేమో
తెల్ల రేషన్ కార్డులు …. // జీవ //
లక్షలు కోట్లల్లోనే
లగాయించి అంచనాలు
లక్ష్యాలు చేరలేని
అరకొరల గమ్యాలు
షెడ్యూళ్లలో రాజ్యాంగం
సేదలు దీరుతున్నది
సంక్షేమాల చిరునామా
జాడలేదు బడుగులకు… // జీవ //
తెగబడె రౌడిమూకల
పెడరెక్కలు విరవలేదు
బాలలను భిక్షుకులుగ
బలవంతం మానలేదు ...
వ్యాపారం వరసమారి
అసువులనే కోరుతున్నది
వడ్డీలకు బెదిరింపులు
గురిచూసిరి అమాత్యుల ..... // జీవ //
నాగరికత మైలురాయి
యాంత్రికత పెంచింది
చేతివృత్తులు చేవచచ్చి
పల్లెతనం తెల్లబోయే…..
విశ్వ బ్రహ్మ కొలిమిలన్ని
వింతగా మాయమయ్యె
నేతన్నల ప్రేవులతో
పడుగు చుట్ట చుట్టింది… // జీవ //
స్థానిక పాలనలన్నీ
స్తబ్దుగ నిదురిస్తుంటే
చాటుమాటు పొరుగుల
సంతజేరు సార్వభౌమత…
చట్టమంటె కొందరికి
కాకూడదు చుట్టములా
పట్టుబట్టి ప్రజలంతా
ఒకటేనని రూఢిపరిచు // జీవ//
లెక్కలేని చట్టాలెన్నో
చక్కబెట్ట లేదొకటన్నా
ఒంటరిగా మహిళనేడు
ఓటి కుండ తీరు చూడు
అరకదున్నే రైతన్నలు
పొలిమేరల పొలికేకలు
మందులు విత్తనాల మునిగి
మద్దతుధర దక్కపాయె…. // జీవ //
పెన్షన్ల పథకాలని
పైసలన్నీ పంచుడే
పానకాల సీసాలకు
పైకము రాబట్టుడే…
ఇంటోన్ని కొట్టపోతె
ఈ మీసం ఎందుకని
ఇచ్చి పుచ్చుకుంటేనే
ఇకమతుల గమ్మతి… // జీవ//
సరిహద్దుల సైనికులకు
సవాలక్ష సవాల్లాయె
ప్రూఫ్ లేని జాకెట్లకు
బుల్లెట్లే ప్రీతిపాత్రం….
సాంకేతికత సంబరాలు
జ్ఞానులుదాటే సంద్రాలు
విదేశాల బతుకుదెరువు
వింత ప్రాప్తం కన్నోళ్లకు ... // జీవ //
పాలకుడు అధికారి
పరితపించి సేవ చేస్తే
ఫలితమింక సులువేగా
ప్రజలవైపు పాలనతో ...
ఆత్మీయతలల్లుకుంటే
అనురాగం పెల్లుబుకితే
మానవత మరలిరాదా
మనుషులంతా కలిసిపోరా .... // జీవ //
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment