జీవన శోభ
తేది : 22-08-22
శీర్షిక : జీవ కళ
కవిత సంఖ్య : 966
తొలగని నిశి తెరలను తోసుకుని
తెలుపు నలుపుల శోభలతో
వచ్చే వర్ణ రంజితమై అల్లుకున్న
ఉదయాత్పూర్వపు మబ్బుతెరలు...
చెట్లనావరించిన పిట్టలన్నీ
ముద్దు ముద్దుగా ఎగురుకుంటూ
గూళ్ళను వదిలి కువకువల
సయ్యాటలతో చేసే ఆనంద నర్తనం ....
అంబారవముల సంబరాలను
కుమ్మరించే ఆలమందలు....
తప్పటడుగులు వేస్తూ తెప్పరిల్లే
చిన్ని చిన్ని లేగదూడలు ....
పల్లె తల్లులంతా పవిత్రంగా చల్లే
కళ్ళాపి జల్లులు... అవనిమాతకు
అందించే పన్నీటి అభిషేకాలు ...
సుందరమై అందంగా తీర్చిదిద్దే
తీరైన రంగవల్లులు .....
దారులకిరువైల పోలుపోసినట్టు
రంగురంగుల పూల పుప్పొడిలతో
పరిమళాలు వెదజల్లుతూ ఆహ్వానాలను
పలికే రకరకాల పూల మొక్కలు ....
చీకు చింతల చిక్కుముడులన్నీ
పైరగాలికి వదిలేసి...చెట్ల మీద గెంతుతూ
నిక్క బొడుచు రోమాల రయ్ రయ్ మంటూ
సయ్యాటలతో లెక్కలేని ఆనందాలను
మూటగట్టుకుంటున్న చిట్టి ఉడతపిల్లలు....
వినమ్రున్ని చేస్తూ వీనుల విందుగా...
అల్లంత దూరంనుండి చెవినపడే
గుడి గంటల నాదం ....ఏడుకొండలవాడి
సుప్రభాత సుమధురం రాగం ....
పంచభూతాల సమ్మిళితమైన
ప్రకృతిలో పరిమళించే ప్రతీది…
ఆస్వాదనలనిచ్చి ఆనందపరుస్తుంది
అదే కదా జీవకళ... మానవాళికి శ్వాస ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment