సంభవామి యుగే యుగే
తేది : 22-09-22
శీర్షిక : అనువైన రూపం
కవిత సంఖ్య : 992
వేదపురాణేతిహాసాల జన్మభూమి
భగవద్గీత బోధనల పుణ్యభూమి
ఆచార వ్యవహారాలకు ఆలవాలం
సంప్రదాయాలకు సమున్నతం
సంస్కారాలకు హిమశిఖరం ....
ఘన చరితల మన హైందవం...
స్వార్థ రథాల స్వారీ సరంగులు
ఆశల కుహారాల మానవాళిలో
ధర్మం దారితప్పి... నైతికతలు
నెవ్వెరపోతున్నప్పుడు….అధర్మం
గేలిచేస్తూ... గల్లల్లెగరేస్తున్నప్పుడు ...
న్యాయదేవత కళ్ళకు గంతలు
కట్టుకుని... కబోది అయిన వేళ ...
సత్యాసత్యాలు సందిగ్ధమయమై ..
నీతి నియమాలు నీటిపాలైపోయి...
అసలు సిసలైన సాక్ష్యాల ఆనవాళ్లు
మసిపూసిన మారేడు కాయలవుతుంటే ....
యుగానికో పాదం కనుమరుగై పోతూంటే
కలిలో ధర్మం ఒంటరిదైపోతున్న దైన్యంలో ...
అధర్మం ఒంట్లో సత్తువలు నింపుకుని... కాల
పరీక్షలలో…కబాడి ఆడుతూ ... విష నాగులై
కసిగా వెంబడించి కాటేయచూస్తూంటే ...
పశు పోలికల మనిషి...మందగించిన
దృష్టితో పరవశిస్తూ...పైవాడి చూపు మరిచిన
రాక్షస మూకల రాకాసి ఆగడాలకు...
అల్లల్లాడుతున్న సాధు సజ్జనులను
ఆదుకోవడానికి... అయోనిజుడైన
ఆ పరమాత్ముడు అనువైన రూపంలో
అవతరిస్తూనే ఉంటాడు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment